TS Medical Colleges తెలంగాణలోని వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించుకునేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు 3,155 మందిని ఒప్పంద విధానంలో, 1,201 మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు వీరిని నియమించనున్నారు. ఇందులో.. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి. 


రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న 4,356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానరసింహ విజ్ఞప్తి మేరకు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి అనుమతులిచ్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ నియామకాలకు ఏడాదికి రూ.634.48 కోట్ల మేర వ్యయం చేయనుందని తెలిపారు.


కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సత్వరమే నియామకాలు చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య కళాశాలలకు అనువైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య విద్యను రాష్ట్రంలో అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాహసపేతమైన నిర్ణయం వల్ల చేపట్టిన నియామకాల ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.


డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు..
డీఎస్సీ 2008 అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నది. సుమారు 15 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సర్కారు ఉపశమనం కల్పించినట్టయింది. 2008 డీఎస్సీలో ఎస్​జీటీ పోస్టులకు బీఈడీ, డీఈడీ చేసిన వారు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తర్వాత డీఈడీ వారికి 30% పోస్టులు ప్రత్యేకంగా కేటాయించి, మిగిలిన 70% పోస్టుల్లో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ముందుగా రిలీజ్ చేసిన సెలెక్షన్ లిస్టులో ఉన్న సుమారు 2,300 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయి. దీనిపై కోర్టులో ఏండ్ల నుంచి కేసు నడిచింది. ఏపీలో ఇలాంటి బాధితులే ఉండగా, వారికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్నారు. దీన్ని ఉదహరిస్తూ తెలంగాణలోనూ అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. అప్పట్లో సుమారు 2,300 మంది ఉండగా, వారిలో చాలామందికి వివిధ ఉద్యోగాలు వచ్చి చేరిపోయారు. ప్రస్తుతం 1,500 మంది వరకూ ఉంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంటీఎస్ కింద నెలకు సుమారు రూ.39వేల జీతం వచ్చే అవకాశం ఉన్నది. త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించి, వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. కాగా, ఎంటీఎస్ అమలు చేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల సెక్రటేరియేట్ లోని మీడియా సెంటర్ వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..