మునుగోడు ఉప ఎన్నిక లెక్కింపు ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే హోరాహోరీగా కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన అభ్యర్థుల్లోనే ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఓట్ల లెక్కింపులో భాగంగా ఒక్కో రౌండ్‌ ముగిసే సమయానికి ఆధిక్యం మారిపోతూ వస్తూ ఉంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై ఓ అంచనాకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ క్రమంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద కోలాహలమైన పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి అనుచరులు టెన్షన్‌ పడుతూ ఉన్నారు.


ఇలాంటి పరిస్థితిలో కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాస్త నిరాశతో మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. తన సొంత మండలం చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని అసహనం చెందారు. చివరికి ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, కానీ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని మాట్లాడారు. 


‘‘చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు. కానీ, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది’’ అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.


చౌటుప్పల్‌ మండలంలో మొత్తం 55,678 ఓట్లు పోల్ అవ్వగా, ఇందులో టీఆర్‌ఎస్‌కు 21,209,  బీజేపీకి 21,174, కాంగ్రెస్‌కు 5,164 ఓట్లు వచ్చాయి. ఇక మునుగోడు కౌంటింగ్‌లో ఉదయం 10.30 సమయానికి నాలుగు రౌండ్‌ల కౌంటింగ్ పూర్తి అయింది. 4 రౌండ్‌లు ముగిసే సరికి 714 స్వల్ప ఓ‍ట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4,854 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 4,555 ఓట్లు వచ్చాయి.


షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బీజేపీ - టీఆర్ఎస్ అభ్యర్థులు


నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో కౌంటింగ్‌ కేంద్రం వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూర్చొని ఉండగా, అదే మార్గం గుండా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు ఎదురు పడగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.


వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి


మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయి స్రవంతికి బీజేపీ, TRS కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.