మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.


అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? అని ప్రశ్నించారు. తాను రాజీనామా చేయడం మునుగోడు ప్రజల కోసమేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట ఉన్న వాళ్లంతా కూడా తెలంగాణ ద్రోహులేనని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయించేవిగా రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు. ప్రజలందరికి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉందని, దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోందని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.


తేడా పోల్చుకోండి - రాజగోపాల్ రెడ్డి
సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్‌ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.


మునుగోడు ప్రజలు బాగా చైతన్యవంతులని, తెలివిగల వారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధర్మం వైపు నిలబడబోరని అన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి భయంతో కౌరవ సైన్యాన్ని దింపిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల మధ్య తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో మునుగోడులో లెంకలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాడని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పంచే డబ్బులను ప్రజలు తీసుకుంటారు కానీ వాళ్ళ ఓటు మాత్రం తనకే వేస్తారనే నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ లలో బీజేపీ పార్టీ బలం పెరిగిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయిందని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రేవంత్‌ రెడ్డి గురించి మాట్లాడదలుచుకోలేదని మండిపడ్డారు. ఇది ఒక వ్యక్తికోసమో, ఎమ్మెల్యే పదవి కోసమో వచ్చిన ఎన్నిక కాదని అన్నారు. మునుగోడులో వచ్చే తీర్పుతోనే తెలంగాణలో మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.


టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా నేడే నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్‌కు మంత్రులు కూడా హాజరుకానున్నారు. చౌటుప్పల్ మండలం, ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రభాకర్ రెడ్డి పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరనున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  నామినేషన్‌కు కాంగ్రెస్ కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇవాళ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మళ్లీ 14న  మరోసారి రెండు సెట్ల నామినేషన్లు వేయనున్నారు.