Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్లకు రంగం సిద్ధమైంది. మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు.  తొలిరోజు ప్రచారం, మొదటి సెట్ నామినేషన్ వేయటానికి బయలు దేరిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ హాజరవుతున్నారు. బంగారుగడ్డ నుంచి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు బీజేపీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌కు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. చౌటుప్పల్ మండలం, ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రభాకర్ రెడ్డి పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా సోమవారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవ్వనున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇవాళ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మళ్లీ 14వ తేదీన  మరోసారి రెండు సెట్ల నామినేషన్లు సమర్పించనున్నారు.  


కీలకంగా మారిన ఉపఎన్నిక 


మునుగోడు ఉప సమరంపై ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇప్పటికే సభలు, సమావేశాలకు భువనగిరి జిల్లాతోపాటు పరిసర జిల్లాల కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో కీలకమైన ఈ సమయంలో ప్రజాప్రతినిధులకు అక్కడ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడంతో ఎన్నికలయ్యే వరకు వారిని కలవాలనే స్థానికులు మునుగోడు వెళ్లాల్సిన పరిస్థితి తప్పదని ప్రజలు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు అటు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. వీరంతా ఇప్పుడు మునుగోడులో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణలో తన సత్తా చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పార్టీ భావిస్తున్నాయి. మునుగోడులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు మూడు పార్టీల నేతలు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడులు ఉంటూ క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు. 


నవంబర్ 3న పోలింగ్ 


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ఇటీవల ప్రకటించింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6న కౌంటింగ్ ఉండనుంది.  అక్టోబర్ 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 2018లో జరిగిన మునుగోడు ఎన్నికకు 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 15 మంది పోటీలో మిగిలారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పట్లో విజయం సాధించారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఉపఎన్నికలో గెలుపుకోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.