Thief Sets Jailor House On Fire: జైలులో సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడంతో కోపం పెంచుకున్న ఓ దొంగ.. జైలర్ ఇంట్లో సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు వాటిని తగులబెట్టాడు. ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లను ముక్కలుగా కత్తిరించి తన కోపాన్ని ప్రదర్శించాడు. దొంగ చేసిన ఈ పని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన సోమాచారి అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతను చేసిన నేర ప్రవృత్తి గురించి పోలీసులు చెప్పిన విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. సత్తుపల్లి సీఐ కరుణాకర్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
సత్తుపల్లి పట్టణంలోని అడపా సత్యనారాయణ వీదికి చెందిన నడిపల్లి రామారావు ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ.10 లక్షల మేర నగుదు, ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై ధర్యాప్తు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా పాత నేరస్తుడు అయిన సోమాచారి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు సోమాచారి విఫలయత్నం చేశాడు.
చోరీ సొత్తుతో విలువైన సామాగ్రి కొనుగోలు..
విలాసాలకు అలవాటు పడిన సోమాచారి చోరీ చేసిన సొత్తుతో రూ.1.61 లక్షల విలువైన సామ్‌సంగ్ పోల్డింగ్ ఫోన్‌తోపాటు రూ.35 వేల క్లాసిక్ వాచ్, రూ.7 వేలు విలువైన జియో స్మార్ట్ ఫోన్, రూ.8,800ల స్పీకర్లు కొనుగోలు చేసి వాటిని కొరియర్ ద్వారా ఇంటికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన డబ్బులో కొంత కుటుంబ సభ్యులుకు ఇచ్చి నగదుతో హైదరాబాద్, షిర్డి, నాసిక్‌లకు అద్దె కార్లలో తిరుగుతూ ఖరీదైన మద్యం సేవించినట్లు, జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమాచారి నుంచి రూ.1.93 లక్షల నగదును రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రూ.10 లక్షల నగదును అపహరించిన సోమాచారి ఆ సొమ్ముతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు జల్సాలకు ఆ డబ్బును ఖర్చు చేశారు.
మంచి చెప్పినందుకు ఇంటికే నిప్పు పెట్టాడు..
సోమాచారిని విచారిస్తున్న సందర్భంగా మరిన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాయి. 2019లో ఓ కేసులో సోమాచారి పోలీసులకు పట్టుబడ్డాడు. మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మరో కేసులో సత్తుపల్లి జైలులో ఉన్న సమయాన అక్కడ జైలర్ హనుమంతరావు అతనిని మంచిగా మెలగాలని సూచించారు. ఈ విషయంపై కోపం పెంచుకున్న సోమాచారి జూలైలో జైలు నుంచి విడుదలయ్యాక జైలర్ హనుమంతరావుపై కక్ష సాధించాలని భావించాడు. జైలు నుంచి విడుదలయ్యాక వారం రోజుల్లో హనుమంతరావు ఇంట్లో ఎవరు లేరని గమనించి అతని ఇంట్లో ఉన్న సామాన్లు ద్వంసం చేశాడు. ఇంటికి నిప్పంటించాడు. దీంతోపాటు ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లను కత్తిరించాడు.
జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించిన జైలర్‌పై కోపం పెంచుకున్న సోమాచారి ఈ విధంగా జైలర్‌పై తన కోపాన్ని ప్రదర్శించినట్లు పోలీసులు వివరించారు. రామారావు ఇంట్లో చోరీ చేయడంతో పోలీసులకు చిక్కిన సోమాచారి గతంలో చేసిన నేరాలు బయటకు వచ్చినట్లు సీఐ వివరించారు. దొంగతనాలకు పాల్పడుతున్న సోమాచారికి తండ్రి, తమ్ముడు సహకరించారని వారు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ కరుణాకర్, సిబ్బంది ఎన్.శ్రీనివాసరావు, లక్ష్మణ్‌రావులను ఏసీపీ వెంకటేశ్ అభినందించారు. కాగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పిన జైలర్ ఇంటినే తగులబెట్టిన సోమాచారి విషయం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడితే ఎప్పటికైనా పోలీసులకు చిక్కడం తప్పదనే విషయం సోమాచారి సంఘటనలో బహిర్గతమైంది.