మునుగోడు ఉప ఎన్నికలో విజయం అనేది మూడు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిన తరుణంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఎవరూ వదులుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందరికీ సీఎం కేసీఆర్ లేఖలు రాయనున్నారు. ప్రభుత్వం తరపున అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరికీ ఆ లేఖలు చేరనున్నాయి. సంక్షేమ పథకాల గురించి ఆ లేఖలో వివరించనున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు గుర్తించారు. వీరందరికీ లేఖలు రాయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆ లేఖల్లో కేసీఆర్ కోరనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణులకు కేసీఆర్ కిట్లు, సీఎం రిలీఫ్ ఫండ్, గొర్రెల పంపిణీ, పంట రుణాల మాఫీతో పాటు ఇతర పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నట్లుగా టీఆర్ఎస్ గుర్తించింది. ఆ లబ్ధిదారులకు కేసీఆర్ లేఖలు రాసి వారి మద్దతు కోరనున్నట్లుగా తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులు ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల రూపంలో రూ.10,260 కోట్ల మేర లబ్ధి పొందినట్లుగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు లెక్కలు తీశారు. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందో కేసీఆర్ ఆ లేఖల్లో పేర్కొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది.
టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలిపింది. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని స్థానిక నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
మునుగోడు బైపోల్ ముఖ్యమైన తేదీలివే
ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022