తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న ‘జన గర్జన’ బహిరంగ సభ ప్రారంభమమైంది.  ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర నేడే ముగియనుంది. మరోవైపు ఈ సభలోనే ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 


మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, మువ్వ విజయ్ బాబు, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 


అంతకుముందు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నేతలు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ పయనమైన రాహుల్ ఖమ్మం చేరుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ కు ఘనస్వాగతం పలికారు. జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ ను వేదిక మీదకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, రేణుక చౌదరి, సీనియర్ నేతలు రాహుల్ ను పలకరించారు. భట్టి విక్రమార్క రాహుల్ కు శాలువా కప్పగా, జగ్గారెడ్డి రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు గద్దర్.



గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఐ కూటమి విజయం కోసం ఖమ్మంలో అప్పట్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగసభకు అప్పుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ జన గర్జన పేరుతో జరిగే సభకు ఖమ్మం రాహుల్ మళ్లీ ఖమ్మంకి వస్తున్నారు. రాహుల్ గాంధీ గత ఏడాది మే 6న వరంగల్ రైతు సంఘర్షణ సభ నుంచి వరుసగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ఆ తర్వాత భారత్​ జోడో యాత్ర సందర్భంగా అక్టోబర్​ 30న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​, నవంబర్​ 7న సంగారెడ్డి శివ్వంపేటలో బహిరంగ సభలను నిర్వహించారు. తాజాగా మరోసారి తెలంగాణ పర్యటనకు రాహుల్ వచ్చారు. రాహుల్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాహుల్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.


భట్టి పాదయాత్ర 1,360 కిలో మీటర్లు


సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మూడు నెలల కింద ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్​ మార్చ్’​ పాదయాత్ర ప్రారంభించారు. శనివారం నాటికి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్​ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ యాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. ఈ ముగింపు సందర్భంగానే జన గర్జన సభను నిర్వహిస్తున్నారు.  
Join Us on Telegram: https://t.me/abpdesamofficial