Indian Student from Nalgonda Dies in Chicago | నల్గొండ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడసు శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె గడుసు నవ్య (24) షికాగోలో జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందారు. ఉన్నత చదువుల (MS) కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె, చదువు పూర్తి చేసి ప్రస్తుతం అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

Continues below advertisement

ప్రమాదం జరిగిన సమయంలో నవ్య తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితులు గాయపడ్డారు. ఉన్నత ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువతి ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబంతో పాటు ఆమె స్వగ్రామమైన చెరువుగట్టులో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి..ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవ్య మరణం తనను ఎంతగానో కలిచివేసిందని, ఆమె కుటుంబానికి ఇది తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి.. నవ్య భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అమెరికాలోని తానా (TANA), ఆటా (ATA) ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Continues below advertisement