Yadadri Thermal Power Plant | దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం పరిధిలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (YTPB) లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-3 (Unit-3) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ప్లాంట్ అంతటా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా పవర్ ప్లాంట్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

Continues below advertisement

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పవర్ ప్లాంట్ లోపల జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? ఎంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్లాంట్ పరిసరాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Continues below advertisement

టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు మరోలా ప్రచారం జరుగుతోంది. పవర్ ప్లాంట్ ఆవరణలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పగా.. కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది.