Telangana Caste Census | నల్గొండ:  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో సామాజిక , ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే ( Comprehensive Family Survey) నిర్వహించడం చారిత్రాత్మకం అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితాకు, కుల గణన సర్వేలో తేలిన సమగ్ర సర్వేలో తేలిన లెక్కలకు అసలు పొంతన లేదన్నారు. కొందరికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, కొందరు సర్వేలో పాల్గొనకపోవడం అందుకు కారణమన్నారు. 


ఓటర్ల జాబితాతో సర్వే నెంబర్లు మ్యాచ్ కావు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా 94, 863  ఎన్యుమరేటర్స్ , 9 628 సూపర్ వైజర్స్, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50  రోజుల్లో తెలంగాణలో సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో 97 శాతం రాష్ట్ర ప్రజలు పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా చేసుకుని సర్వే లెక్కలు సరిగ్గా లేవనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటర్ లిస్టుకి , సమగ్ర సర్వే లెక్కలకు కచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. కొందరు వ్యక్తులు 2 చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే లెక్కలు కాస్త మ్యాచ్ అవుతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమగ్ర, కులగణన (Caste Census) సర్వే లెక్కలు తప్పుడు జాబితా అని విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వం చేసిన పనిని పార్టీలకు అతీతంగా ఎవరైనా అభినందించాలి . 


రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం అవసరం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. 3 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. సర్వే కోసం వచ్చిన అధికారులకు వారు వివరాలు ఇవ్వలేదు. అలాంటి వారు సైతం ఇప్పుడు అధికారులకు తమ వివరాలు ఇవ్వవచ్చు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులతో పాటు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 


ఇచ్చిన మాట ప్రకారం సర్వే


గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు కొతత రేషన్ కార్డులను ఇస్తుంది. BPL, APL  కార్డ్స్ సైతం ఇవ్వాలని నేను సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. BPL, APL కార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 


తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ 2 ఎకరాల వరకు రైతు భరోసా నగదు అందించింది. రైతుల ఖాతాల్లో ఎకరాకు 6 వేల చొప్పున జమ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కనుక కోర్ట్ ప్రకటనపై స్పందించను. నాకు రాజకీయాలకు సంబంధం లేదు. కానీ కుల , మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎవరు మాట్లాడిన అది తప్పే. బీసీలు, అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడం సరికాదు. మరోవైపు మదర్ డైరీ ఆస్తులు అమ్మడం సరికాదని నా అభిప్రాయం. ఆస్తులు అమ్మడం ఎప్పటికీ సరైన పరిష్కారం కాదు. సంస్థను మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు’ గుత్తా సుఖేందర్ రెడ్డి.


Also Read: Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం