Madhya Pradesh Road Accident | భోపాల్: మహాకుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ లోని సిహోరా వద్ద బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంభమేళా భక్తులు ఏడుగురు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి (30) మీద మోహ్లా బార్గి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
మొదట మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని భావించారు. వారి వద్ద ఉన్న వివరాలు పరిశీలిస్తే హైదరాబాద్ లోని నాచారానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతులను సంతోష్, శశికాంత్, నవీన్, బాలకృష్ణ, రవి, ఆనంద్‌లుగా గుర్తించారు. వీరు నాచారంలోని రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్ కు చెందినవారు అని మధ్యప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని నాచారానికి చెందిన కొందరు భక్తులు ఓ ప్రైవేట్ వాహనంలో కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం NH-30పై మోహ్లా-బార్గి వంతెన సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఏడుగురు ఏపీ వాసులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జబల్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్ లోని సిహోరా బైపాస్ వద్ద 10 నుంచి 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ ఏపీ29 W 1525 గా ఉండటం చూసి మినీ బస్సు ఏపీకి చెందినదిగా భావించారు. బాధితులను సంప్రదించగా, వారు హైదరాబాద్ లోని నాచారం నుంచి కుంభమేళాకు వచ్చి వెళ్తున్నారని జబల్‌పూర్ పోలీసులు తెలిపారు.