Chilkuru Balaji Priest Rangarajan Attack case | హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి తెలంగాణలో సంచలనంగా మారింది. రాజకీయాలకు అతీతంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగరాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని నేతలంతా అభిప్రాయపడ్డారు. ప్రతి పార్టీ నేతలు ఆయనను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, చర్యలు తీసుకోవడం లేదన్న ప్రతిపక్ష విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రంజరాజన్‌ను పరామర్శించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేకు విషయం తెలిపి, సమస్యను తన దృష్టికి తీసుకురావాల్సిందని పేర్కొన్నారు.
మరోవైపు అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై జరిగిన దాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దాడి ఘటనపై ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసిన పోలీసులు మొదట ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్ట్ చేయడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రంగరాజన్‌కు మద్దతు రావడం, అన్ని పార్టీలు ఆయనపై దాడిని ఖండించడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేశారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం, నిజామాబాద్ కు చెందిన ఇద్దరు మహిళలు, మరో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
వీరరాఘవరెడ్డి బ్యాక్‌గ్రౌండ్..
రాజేంద్రనగర్ డీసీపీ కథనం ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అతడు హైదరాబాద్ వేదికగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. గండిపేట మండలం మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి 2022లో ‘రామరాజ్యం’ అనే సంస్థను స్థాపించాడు. హిందూధర్మ రక్షణకు రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ హిందూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. ఈ మేరకు తాను శ్లోకాలు చదువుతూ సనాతన ధర్మం, రామరాజ్యం గురించి చెబుతూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా జనాలను ప్రేరేపించాడు. నెలకు రూ.20 వేల జీతం సైతం ఇస్తానని హామీ ఇవ్వడంతో కొందరు అతడి మాట నమ్మి అనుచరులుగా చేరారు.
Also Read: వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి- రంగరాజన్‌పై దాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
గతంలో పలుచోట్ల ఆలయాలకు చెందిన వారిపై బెదిరింపులకు దిగి కేసుల్లో చిక్కుకున్న వీరరాఘవరెడ్డి ఈ క్రమంలో తన అనుచరులతో చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లాడు. తాను ఇక్వాకు వంశానికి చెందినవాడినని, రామరాజ్యం స్థాపనకు తనకు సహకారం అందించాలని ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ను కోరాడు. తనకు ఆర్థిక సహకారం చేయాలని, రామరాజ్యం స్థాపన కోసం తన ఆర్మీలో సభ్యులను చేర్పించాలని ఒత్తిడి తేవడంతో అందుకు రంగరాజన్ నిరాకరించారు. దాంతో వీరరాఘవరెడ్డి, ఆయన అనుచరులు కలిసి అర్చకులు రంగరాజన్‌పై దాడి చేశారు. రంగరాజన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఆదివారం ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని, సోమవారం మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని రాజేంద్రనగర్ డీసీపీ వివరించారు.
నేరుగా వెళ్లి పరామర్శించిన కొండా సురేఖ
ఇది ఓ వ్యక్తిపై జరిగిన దాడి కాదని, హిందూ ధర్మపరిరక్షణపై జరిగిన దాడిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరుకు వెళ్లి రంగరాజన్‌ను కలిశారు. ఆయనను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దాడి ఘటనకు బాధ్యుల అరెస్టుపై పోలీస్ శాఖను ఆదేశించినట్లు తెలిపారు.