Telangana News: లోక్‌సభ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ, బీఆర్‌ఎస్ మధ్య ఏర్పడిన గ్యాప్ మరింత పెరుగుతోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని భావించిన బీఆర్‌ఎఎస్ విమర్శల దాడి పెంచింది. వాస్తవాలు చెప్పిన తన నేతపై అనవసరంగా దాడి చేస్తున్నారని గుత్తాసుఖేందర్ రెడ్డి వర్గం అదే స్థాయిలో కౌంటర్ అటాక్ మొదలైంది.
పార్టీ మారుతున్నట్టు ఎక్కడా చెప్పకపోయినా గుత్తా సుఖేందర్ రెడ్డి... ప్రస్తుతం తాను ఉన్న పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న లోపాలు ఎత్తి చూపారు. తను పార్టీ లోకి ఎలాంటి హామీ ఇచ్చి తీసుకు వచ్చారో కూడా వివరించారు. ఓటమికి కారణాలపై కూడా తన విశ్లేషణ తెలిపారు. తన వారసుడి విషయంలో ఏం జరిగిందో పేర్కొన్నారు.
గుత్తాసుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కలకలం రేపాయి. పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమైన గుత్తా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విరుచుకుపడ్డారు. గాదరి చేసిన వ్యాఖ్యలపై గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీలు అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ "40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాదరి కిషోర్‌కు లేదు. ఒక ఉపాధ్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవాడిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి కిశోర్. ఉస్మానియా యూనివర్సిటిలో వేల మంది చేసిన ఉద్యమాలను తన ఖాతాలో వేసుకొని స్నేహితులను ముంచారు. ఉద్యమకారుడి కోటాలో MLA టికెట్ తెచ్చుకొని తుంగతుర్తి ప్రాంతానికి చేసింది ఏమి లేదు.ఇసుక దందానీ వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. అని విమర్శించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రధాన కారుకుడు కిషోర్ అని గుత్తా వర్గీయుల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. దొంగ నోట్ల కేసులు, ఇసుకదందాలు, భూ కబ్జాలు, బ్లాక్ మెయిల్ చేసి పార్టీ పరిస్థితిని దిగజార్చాలని ఆరోపించారు. స్థాయి మరిచి చిన్నా, పెద్దా తేడా లేకుండా మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి గుత్తా సుఖేందర్ లాంటి వ్యక్తిపై మాట్లాడితే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌లో నేతల మధ్య మాటల యుద్ధం కొత్త చర్చకు దారి తీసింది.