నలుగురు స్నేహితులతో కలిసి ఊరుకాని ఊరు వచ్చాడు. ఐస్‌క్రీం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. మొదట చిన్న గాయాలే అనుకున్నారంతా. తర్వాత కానీ తెలియలేదు అది ఎంత ప్రమాదకరమో. ముప్పును గ్రహించి సొంతూరు పయనమయ్యారు. కానీ ఇంతలోనే మరో ఘోరం జరిగిపోయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనోజ్ జిల్లా ధ్యాస్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల ములకరాజ్ పొట్టకూటి కోసం తెలంగాణ వచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అతను... సూర్యపేటలో వ్యాపారం మొదలు పెట్టాడు. అయిటిపాముల వద్ద ఐస్‌క్రీంలు విక్రయిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ టూవీలర్ వచ్చి ఢీకొట్టింది. గాయాలపాలైన అతన్ని నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు సూర్యపేట వెళ్లాలని రిఫర్ చేశారు.
ములకరాజ్‌ను పరీక్షించిన సూర్యపేట వైద్యులు... పరిస్థితి బాగాలేదని... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే భారీ ఖర్చుకు భయపడిన స్నేహితులు.. ఇంటికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించారు. విషయాన్ని స్నేహితుడు ములకరాజ్‌కు కూడా చెప్పారు. అతను కూడా సరే అన్నాడు. సొంతూరు వెళ్లిపోతే పరిస్థితి కాస్త కుదట పడుతుందేమో అనుకున్నాడు.
సొంతూరు వెళ్లిపోయేందుకు ఐదుగురు స్నేహితులు టికెట్లు తీశారు. ట్రైన్ ఎక్కారు కూడా. మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాస్త నలతగా ఉందని ట్రైన్ దిగాడు ములకరాజ్. అక్కేడ విశ్రాంతి తీసుకొని తుది శ్వాస విడిచాడు. మళ్లీ ట్రైన్ ఎక్కుదామని స్నేహితులు పిలుస్తుంటే అతనిలో చలనం లేదు. రైల్వే స్టాఫ్ వచ్చి చూస్తే ఊపిరి ఆగిపోయింది. ములకరాజ్ చనిపోయాడని స్నేహితులకు చెప్పారు.
స్నేహితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న ఆ నలుగురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్లాట్ ఫాం నుంచి మార్చురీకి తరలించాలని ఆదేశించారు. స్నేహితులు రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆటోవాలాలను, ప్రైవేట్ వాహనాలను అడిగితే వారు 5 వేల రూపాయలు అడిగారు. అంత డబ్బు తమ వద్ద లేదని.. కనికరించాలని రిక్వస్ట్ చేశారు. ఎవరూ ముందుకు రాలేదు.
చేతిలో ఉన్న డబ్బులతో ఓ రిక్షా కార్మికుడికి రిక్వస్ట్ చేశారు. ఆయన ఐదు వందలు ఇస్తే వస్తానని చెప్పాడు. అందుకు ఓకే చెప్పిన మిత్రులు ఐదు వందలు ఇచ్చారు. ఆ రిక్షాలో మిత్రుడి శవాన్ని వేసుకొని ఆ నలుగురు స్నేహితులు ఖమ్మం ఆసుపత్రికి వచ్చారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి సొంతూరికి పయనమయ్యారు.
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెడ్‌బాడీలను తరలించడానికి అంబులెన్స్‌లు వేలకు వేలు డిమాండ్ చేసిన విషయం వైరల్‌గా మారింది. దీంతో కొందరు బాధితులు టూవీలర్స్‌లో మోసుకుంటూ డెడ్‌బాడీలను ఇళ్లకు తీసుకెళ్లారు.