Falaknuma Express Accident: హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రయాణికుల అప్రమత్తతోనే ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారని, అంతలోనే రైలు ఆగిపోవడంతో హుటాహుటినా అందరు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఒక్కో బ్యాగు మాత్రమే ఉన్న వారు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు వెంటనే రైలు దిగిపోగా.. ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తున్న వారు, కుటుంబంతో కలిసి ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓ వైపు మంటలు పెరిగిపోతూ ఒక బోగీ నుంచి మరో బోగీకి వ్యాపిస్తుండగా.. కిక్కిరిసిపోయిన ప్రయాణికుల నుంచి కుటుంబసభ్యులను, లగేజీని బయటకు తీసుకువచ్చేందుకు అవస్థ పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు బోగీలకు వ్యాపించి పూర్తిగా కాలిపోయే లోపే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. 


మంటలు చెలరేగి పొగలు బోగీ అంతా వ్యాపించి ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. దీంతో ఆ అపాయం నుంచి బయట పడటమే మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా మంది ప్రయాణికులు మొదట బోగీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలతో బయటపడ్డాక.. తమ తమ కుటుంబసభ్యుల కోసం వెతకడం మొదలు పెట్టారు. వారి పేర్లను గట్టి గట్టిగా పిలుస్తూ దూరం దూరంగా ఉన్న వారు ఒక్కటయ్యారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అగ్ని కీలల్లో తగలబడిపోయాయి. చుట్టూ పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మిగతా బోగీలకు నిప్పు అంటుకోకుండా మండుతున్న బోగీలను మిగతా బోగీలతో లింక్ తప్పించారు.


ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే?


ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ప్రత్యక్ష సాక్షులు వణికిపోతున్నారు. ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఛార్జింగ్ పాయింట్ సమీపంలో సిగరెట్‌ తాగారని అంటున్నారు. అక్కడ సిగరెట్ కాల్చవద్దని పదే పదే అతనికి హెచ్చరించినా వినిపించుకోలేదని వివరిస్తున్నారు. దీని వల్ల ఎస్‌ 4లో మంటలు చెలరేగాయన్నారు. అవి క్షణాల్లోనే మిగిలిన మూడు బోగీల్లోకి వ్యాపించాయంటున్నారు. 


ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు


ఇప్పుడు ప్రమాదానికి గురైన బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తరలించడానికి ప్రత్యేక చర్యలు అధికారులు తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా నాలుగు బస్‌లను ఏర్పాటు చేశారు. సేఫ్‌గా ఉన్న బోగీలను సురక్షితంగా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. 


నాలుగు రోజుల క్రితమే బెదిరింపు లేఖ


దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫ్రమ్‌ అడ్రెస్ లేకుండానే వచ్చిందా లేఖ. మరో నాలుగు రోజుల్లో ఒడిశా తరహా ఘటన చూడబోతున్నారంటూ ఆగంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు


ప్రమాదం జరిగిన రైలు ట్రాక్ పైనే ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ విషయంలో గుర్తించాలని సూచించారు.