Munugodu By-Election: మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉపఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకులను రంగంలోకి దించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్‌ను ఈసీ నియమించింది. ఈయన శుక్రవారం అంటే 14వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు మునుగోడులో బాధ్యతలు నిర్వర్తిస్తారు.
పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3వ తేదీ వరకు మునుగోడు ఉపఎన్నికక కోసం విధులు నిర్వర్తిస్తారు.
మొదటి రోజు నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల నేతలు..
యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. వీరందరి మధ్య రాజగోపాల్ రెడ్డి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి 3 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా సోమవారం నామినేషన్ వేశారు. అలాగే ఐదుగురు స్వతంత్య్ర అభ్యర్థులు, యుగ తులసి పార్టీ తరఫున మరొకరు నామినేషన్ వేశారు. దీంతో మూడో రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 23కు చేరుకుంది.
ప్రచార దూకుడు పంచిన పార్టీలు..
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, ఉపఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణలో తన సత్తా చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తున్నాయి. మునుగోడులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు మూడు పార్టీల నేతలు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడులు ఉంటూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈనెల 3వ తేదీన విడుదల చేశారు. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించారు. వచ్చే నెల 3వ తీదన పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతోపాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.