మునుగోడు ఉప ఎన్నిక పోరులో గెలిచేందుకు ఒక్కో రాజకీయ పార్టీ ఎత్తులకు మించిన పైఎత్తులు వేస్తోంది. ఎవరికి వారు ఇందుకు వ్యూహాలను కొద్ది వారాలు, నెలల ముందు నుంచే మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఓటర్ల నమోదు విషయంలో టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. కొత్తగా ఓట్ల కోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య ఈ 2 నెలల్లోనే 25 వేలు దాటిందని బీజేపీ చెబుతోంది. అయితే, ఈ అంశంపై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల నమోదు అంశంపై లోతైన విచారణ చేయాలని హైకోర్టును బీజేపీ కోరింది. బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


అంతకుముందు 7 నెలల కాలంలో 1,500 మంది కూడా కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఈ మధ్య కాలంలోనే పెద్ద మొత్తంలో ఏకంగా 24,781 దరఖాస్తులు వచ్చాయని బీజేపీ వాదిస్తోంది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. 


అయితే, బీజేపీ దాఖలు చేసిన ఈ లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనా రెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనుందని రచనా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, ఈ నెల 13న విచారణ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.


విపరీతమైన డబ్బు చెలామణి
ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక కారణంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సాగుతూండటంతో పెద్ద ఎత్తున పార్టీలు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఓటర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పట్టుబడుతున్న డబ్బు అంతా మునుగోడుకే వెళ్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతోనే సోదాలు చేసి నగదును పట్టుకుంటున్నారని చెబుతున్నారు. 


హైదరాబాద్‌లో ప్రతీ రోజూ రూ. కోట్లలో నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారో పోలీసులే కొత్తగా సోదాలు ప్రారంభించారో కానీ పెద్ద ఎత్తున నగదు హవాలా రూపంలో తరలి పోతోంది. ఇందులో దొరుకుతోంది మాత్రమే తెలుస్తోంది.. ఎంతెంత తరలి పోతోందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మంగళవారం గాంధీనగర్‌లో పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా తరలిస్తున్న రూ. 3.5కోట్ల హవాలా మనీ దొరికింది. మొత్తంగా మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.