తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణిలో 40 వేల మంది కార్మికులు, మూడు వేల మందికిపైగానే అధికారులు పనిచేస్తున్నారు. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాలలోని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు సరిపడే బొగ్గును సరఫరా చేస్తూనే మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి సింగరేణి అడుగుపెట్టింది. 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు సోలార్‌ పవర్‌ రంగంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది. సింగరేణి యాజమాన్యంలో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌తోపాటు ఐదుగురు డైరెక్టర్లు ఉంటారు. వీరితోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు డైరెక్టర్లు యాజమాన్యం బోర్డులో ఉంటారు. వీరే సంస్థకు దిశా నిర్దేశం చేస్తుంటారు.


ఏడేళ్లుగా ఇన్‌చార్జ్‌లతోనే డైరెక్టర్‌ ‘పా’ పోస్టు నిర్వహణ


సింగరేణిలో సీఅండ్‌ఎండీ తర్వాత కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే డైరెక్టర్‌ ‘పా’ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్పేర్‌) పోస్టు కీలకంగా ఉంటుంది. గతంలో ఈ పోస్టులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించేవారు. అయితే ఏడేళ్లుగా సింగరేణి డైరెక్టర్‌ పోస్టు మాత్రం ఇన్‌చార్జ్‌ల నిర్వహణలోనే ఉంది. 2015లో సింగరేణి డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌ బదిలీ అనంతరం ఈ పోస్టును మిగిలిన డైరెక్టర్‌లకు ఎఫ్‌ఏసీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌)గా నిర్వహిస్తున్నారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం పారదర్శకంగా పరిపాలన కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ పోస్టును అప్పగించేది. అయితే ఏడేళ్లుగా మాత్రం ఈ పోస్టు కేవలం ఇన్‌చార్జ్‌ల చేతులోనే ఉండటం గమనార్హం. గత ఏడాది క్రితం సింగరేణి ఫైనాన్స్‌గా బాద్యతలు తీసుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారి బలరామ్‌కు డైరెక్టర్‌ ‘పా’ పోస్టును ఎఫ్‌ఏసీగా ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన డైరెక్టర్‌ ‘పా’ బాధ్యతలు నిర్వహస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇరవైరోజుల క్రితం డైరెక్టర్‌ ఆపరేషన్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. మరో ఆరు నెలలో పదవి విరమణ చేయబోతున్న డైరెక్టర్‌కు ‘పా’ బాద్యతలు అప్పగించడం ఇప్పుడు సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది.


సమన్వయం లోపించిందా..?
సింగరేణి సంస్థకు ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్‌లు కీలకంగా పనిచేస్తారు. అయితే యాజమాన్యం బోర్డులో సమన్వయం లేకపోవడమే ఈ పోస్టుల మార్పునకు కారణంగా తెలుస్తోంది. డైరెక్టర్‌ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు నేపథ్యంలోనే పోస్టులు మార్పు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణి సంస్థ గత ఏడేళ్ల కాలంలో ఇప్పటి వరకు చేపట్టిన రిక్రూట్‌మెంట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో జరిగిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలతోపాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీనియర్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు అకస్మాత్తుగా ‘పా’ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు డైరెక్టర్ల మద్య ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్లు కార్మికులు పేర్కొంటున్నారు.


ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్‌ వెలుగులు అందించడంలో కీలకంగా ఉన్న సింగరేణి సంస్థలో పారదర్శక పాలన జరిగేందుకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి డైరెక్టర్‌ ‘పా’ బాధ్యతలు అప్పగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారికి బాద్యతలు అప్పగించడం వల్ల సంస్థ పరిపాలన విభాగం పారదర్శకంగా ఉంటుందని కోరుతున్నారు. ఏడేళ్లుగా ఇన్‌చార్జ్‌ల బాధ్యతలో ఉంటున్న డైరెక్టర్‌ ‘పా’ పోస్టును ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.