Dhanurmasa Celebrations Yadadri: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం అంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల అంటే జనవరి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగకు ముందే చేపట్టే ధనుర్మాస ఉత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీంగ నాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహిస్తారు. ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్ లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపించనున్నారు. బ్రహ్మీకాలంలో అమ్మవారు స్వామి వారిని ఆరాధించే పర్వాన్ని పాశుర పఠనం, పొంగళి నివేదనలతో కొనసాగిస్తారు.


జనవరి 14వ తేదీన రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, మర్నాడు అంటే జనవరి 15వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ గీత తెలిపారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించాలని ఆలయ ఈఓ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆయం యాదాద్రిని రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. యాదాద్రి కొండ దిగువన కూడా యాదగిరిగుట్ట పట్టణంలో సుందరీకరణ పనులు చేసింది. కనుక సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ ధనుర్మాసంలో స్వామి వారి చెంత ఉన్న కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి.