మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేశారని అందులో పేర్కొన్నారు. 




కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేత అయిన పాల్వాయి స్రవంతి మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె. మునుగోడు ఉప ఎన్నికలో ఆమెను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌లో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా సర్వే నిర్వహించగా, ఆమెకే అంతా ఓటు వేసినట్లుగా తెలిసింది. పాల్వాయి స్రవంతితో పాటు చల్లా కృష్ణారెడ్డి పేరు కూడా సర్వేలో కాస్త ఎక్కువే వినిపించినా చివరికి స్రవంతి పేరు ఖరారయ్యింది.


2014లో పోటీచేసి ఓటమి
2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మునుగోడు నుంచే పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మునుగోడు టికెట్ ఇచ్చింది. దాంతో ఆమె సంతోషంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పని చేశారు. 


పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డి మునుగోడులో తొలి ఎమ్మెల్యే. 1967 నుంచి 1985 వరకూ ఆయన ఏకధాటిగా నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1985 నుంచి 1999 వరకూ సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో మరోసారి పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2014 తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.