చత్తీస్‌ఘడ్ దండాకారణ్యానికి పరిమితమైన మావోయిస్టులు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్ల ఏరియా కమిటీతోపాటు, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యవర్గం కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్సీ రోహిత్‌రాజ్ గత రెండు రోజుల క్రితం మైదాన ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టులకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే పోస్టర్‌లలో ఉన్న కీలకమైన నాయకురాలిని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి జిల్లా ఎస్సీ వినీత్ వెల్లడించారు.
కూంబింగ్‌లో దొరికిన ఇద్దరు మహిళా మావోయిస్టులు
సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన దళం చర్ల మండలంలోని కుర్నవల్లి, బోదవల్లి మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో చర్ల పోలీసులు స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మావోయిస్టులు తారసపడ్డారని, వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసులకు చిక్కారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. చర్ల ఏరియా కమిటీ మెంబర్ అయిన మడకం కోసి అలియాస్ రజితతో పాటు దళ సభ్యురాలైన మడవి ధని పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 20 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్స్, కార్డెక్స్ ఫైర్‌తో పాటు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మడకం కోసి అలియాస్ రజితపై ఇప్పటి వరకు అనేక కేసులు ఉన్నాయని, 81 సంఘటనలలో ఆమె ప్రమేయం ఉందని ఎస్పీ వినీత్ తెలిపారు. ఇటీవల చర్ల మండలంలో ఇన్‌ఫార్మర్ నెపంతో హత్యకు గురైన ఉపసర్పంచ్ విషయంలో రజిత ప్రమేయంతోనే ఉందన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ సూచించారు.
సరిహద్దు ప్రాంతాల్లో కలకలం
రెండు రోజుల క్రితమే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలకు సంబంధించిన పోస్టర్‌ను పోలీసులు ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో ఉన్న మడకం కోసి అలియాస్ రజిత ఉండటం ఆమె పోలీసులకు చిక్కడంతో తెలంగాణ – ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాలలో కలవరం రేపుతోంది. మావోయిస్టులు తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకుని మైదాన ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేయడంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్టులను మైదాన ప్రాంతంలోకి రాకుండా నిలువరించేందుకు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో చెకింగ్ లు మమ్మురం చేయడంతోపాటు కూంబింగ్‌ను జరుపుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సరిహద్దు ప్రాంతాల గిరిజన ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. మరోవైపు పోలీసుల చర్యకు ప్రతిచర్యగా మావోయిస్టులు ఏదైనా చర్యలకు పాల్పడతారా? అనే విషయంపై గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సద్దుమణిగాయని ఊహించిన తరుణంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అటవీ ప్రాంతంలోని గిరిజన గూడేలలో కలవరాన్ని రేపుతున్నాయి.