Congress MP KomatiReddy:


షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ను కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తో భేటీ అయిన ఆయన, యువజన కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. పార్టీ ప్రతి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు కష్టపడుతున్నారని, కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. యువతకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఉండాలని, టికెట్ల కేటాయింపులో మహిళలకు మంచి కోటా రాబోతుందన్నారు. 


బీఆర్ఎస్ కుటుంబ, ప్రాంతీయ పార్టీ
బీఆర్ఎస్ ప్రాంతీయ, కుటుంబ పార్టీ కావడంతోనే అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 15 లోపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మొత్తం విడుదల చేయాలని మురళీధరన్ కోరినట్లు తెలిపారు. ఈనెల 11 లేదా 12న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్న ఆయన, రేపటి సమావేశంలో దాదాపు 60 నుంచి 70 సీట్లను ఫైనల్ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఈసీ మీటింగ్ అయ్యేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలకు సమయం లేదని, అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయితే, వారంతా నియోజకవర్గాలకు వెళ్లి పని చేస్తారని తెలిపారు. 


జనాభా నిష్పత్తి ప్రకారం టికెట్లు
అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్న కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగిల్ అభ్యర్థి సీట్లను ఫైనల్ చేయాలని మురళీధరణ్ కు విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఆదివారం జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 90 శాతం కసరత్తు పూర్తి చేసి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాలని సూచించానన్నారు.