Trending
CM Revanth Reddy: సలీమా పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు
Telangana News | కాలిన గాయాలతో మంచానికి పరిమితమైన మహిళకు ఆమె కూతురు అమ్మగా మారి సేవలు చేస్తున్న పరిస్థితి చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు.
నూతనకల్: కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన మహిళ కుటుంబ పరిస్థితిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. సలీమాను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించాలని, దివ్యాంగుల పింఛను వస్తుందో లేదో తెలుసుకుని అందుకు ఏర్పాటు చేయాలని సైతం ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశాలు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారానికి చెందిన సలీమా పరిస్థితిపై మీడియాలో వచ్చి కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సలీమాకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజన సదుపాయం సైతం కల్పించాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆయన ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో సలీమా విషయంపై మాట్లాడారు.
కాలిన గాయాల కారణంగా సలీమా మంచానికే పరిమితమయ్యారు. నరాలు దెబ్బతినడంతో ఆమె ఏం పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సలీమా 10 ఏళ్ల కుమార్తె రిజ్వాననే తన తల్లికి దగ్గరుండి సపర్యలు చేయడం అందర్నీ కలిచి వేసింది. ఒక వైపు అమ్మ సలీమ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు ఆ చిన్నారి స్కూలుకు సైతం వెళ్లి చదువుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు సూర్యాపేట కలెక్టర్‌తో మాట్లాడారు. ఆమెకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో పాటు దివ్యాంగుల ఫించన్ సైతం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.