మునుగోడు జనసంద్రంగా మారింది. ప్రజాదీవెన పేరుతో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం తరలి వచ్చారు. మంత్రి జగదీష్‌ రెడ్డి, నల్గొండ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు జన సమీకరణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా నేతలు ఈ సభకు వచ్చారు. 


ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయల్దేరిన సీఎం కేసీఆర్‌కు నేతలు ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గం వచ్చిన కేసీఆర్‌కు దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. 


గ్రేటర్‌ హైదరాబాద్ లీడర్లతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన లీడర్లంతా భారీగా కార్లతో సీఎం కేసీఆర్‌ను ఫాలో అయ్యారు. నాలుగు నుంచి ఐదు వేల కార్లతో ఈ ర్యాలీ చేపట్టినట్టు టీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. ఇందులో పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా పాల్గొన్నారు. భారీ ర్యాలీతో హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చేందుకు సీఎం కేసీఆర్‌కు సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. 






నాలుగు గంటల ప్రాంతంలో సభా వేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్‌... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అందరికీ అందరికీ అభివాదం చేశారు. అనంతరం సభను ప్రారంభించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న వామపక్షాలు కూడా ఈ సభలో పాల్గొన్నాయి. 
 


మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్


చలో మునుగోడు సభ విజయవంతం చేయడానికి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ చేరుకున్నారు. సీఎం కాన్వాయ్‌ వెంట ఉప్పల్ బాగయత్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ బాగయత్ చేరుకున్న మల్లారెడ్డి డాన్సులతో వచ్చిన కార్యకర్తలను ఉత్సాహపరిచారు.