CM KCR: ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు ప్రజలు నమ్మొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదన’ సభలో సీఎం మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ, తాను కాంగ్రెస్ పార్టీ లెక్క కాదని, త్వరలోనే పింఛన్లు పెంచుతామని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కేవలం రూ.200 పింఛన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచిందన్నారు.  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామన్నారు. 


ఇవాళ బరిలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఉన్నాయని.. వీళ్లేమైనా మనకు కొత్తవాళ్లా? ఒక్క అవకాశం కావాలని వాళ్లు అడుగుతున్నారని.. ఎన్ని అవకాశాలు ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు అవకాశం ఇచ్చారని, ఎన్నడైనా సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో మెడికల్‌ కాలేజీ పెట్టాలని ఆలోచించారా? అలాంటి వారికి ఎందుకు ఓటేయాలని ప్రతిపక్షాలను నిలదీశారు. గతంలో నల్గొండ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు.  


తెలంగాణ రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా అని నిలదీశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలని ఏనాడైనా ఆలోచన చేయలేదని. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు ప్రజలు రైతులు వెళ్తే కరిచినట్టు మాట్లాడేటోళ్లు కానీ నేడు పరిస్థితి మారిపోయిందన్నారు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఏ ఒక్కరిని విస్మరించకుండా.. అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామని అన్నారు. కల్యాణలక్ష్మీ ప్రారంభించినప్పుడు మొదట రూ.50 వేలే ఇచ్చామని, ఆ తర్వాత పెంచుకున్నామని, పెన్షన్‌ మొదట వెయ్యి మాత్రమే ఇచ్చేవారమని, కానీ తర్వాత రూ.2,016కు పెంచినట్లు చెప్పారు. 


కాంగ్రెస్‌ హాయంలో రూ.500 కూడా పెన్షన్‌ ఇవ్వలేదు. కేవలం 200 మొఖాన కొట్టిన కాంగ్రెస్‌, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాళ్లు పరిపాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా తప్పకుండా పెన్షన్‌ పెంచుతామని, వివరాలు త్వరలోనే. ప్రకటిస్తానని అని చెప్పుకొచ్చారు.


ఒకనాడు మోటార్‌ కాలిపోతే మనిషికి మూడు వేలు వసూలు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేవారని, ఈనాడు రాష్ట్రంలో ఎన్ని హెచ్‌పీలు పెట్టినవ్‌? ఎన్ని మోటార్లు పెట్టినవ్‌? నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుంటున్నవ్‌ అని అడిగేటోళ్లు ఉన్నరా? ప్రజలను అడిగారు. బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే, కాంగ్రెస్ నేతలు ఏమో మూడు గంటల కరెంట్‌ చాలని అంటారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించారని, గ్రామాలే కాదు, బెంగళూరు సిటీలో కూడా కరెంట్‌ కోతలు విధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ గతి వస్తుందన్నారు. 


తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ ఆపద్బంధు పథకం, బీఆర్‌ఎస్ రైతు బీమాను పోల్చి చూడాలని  ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోందన్నారు. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని, ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉన్నారా? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి తెచ్చామన్నారు.  


సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు 
సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే  4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున , సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ, స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.