BRS Leader Jitta Balakrishna: తెలంగాణలో మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ ఈ ఉదయం కన్నుమూశారు 52 ఏళ్లు బాలకృష్ణ... కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే జిట్టా బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. భువనగిరిలోని మగ్గంపల్లి రోడ్డులో ఆయనకి ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
జిట్టా బాలకృష్ణ 1972లో నాటి నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించారు. బీబీనగర్‌లో విద్యాభ్యాసం చేశారు. భువనగిరిలో కాలేజీ విద్యను పూర్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ఉన్న జిట్టా బాలకృష్ణ...ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌తో కలిసి చాలా పోరాటాలు చేశారు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతు చెప్పడంలో విజయవంతమయ్యారు.
Also Read: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్
రాజకీయంగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న జిట్టా బాలకృష్ణ. 2009లో టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉండటంతో వైసీపీలో కూడా పని చేశారు.
అయితే జగన్ సమైక్యాంధ్రకు జైకొట్టడంతో వైసీపీతో విభేదించి బయటకు వచ్చేశారు. అప్పుడు వేరే పార్టీల్లో చేరితే లాభం లేదనుకొని యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
బీజేపీలో విలీనం అయిన కొన్నిరోజుల వరకే అందులో ఉన్న జిట్టా బాలకృష్ణ తర్వాత ఇమడలేకపోయారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా ఉండలేక మళ్లీ సొంతగూటికి వచ్చేశారు గత ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం అనారోగ్యం పాలై రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Also Read: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?