Warangal Khammam Nalgonda Graduates MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27 వ తేదీన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో భారత రాష్ట్ర సమితి (BRS) ప్రచార స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాలో తిరుగుతూ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.


పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఉప ఎన్నిక 
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి. బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2021 వ సంవత్సరంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.




కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ
బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna), బిజెపి అభ్యర్థిగా గుజ్జులా ప్రేమేందర్ రెడ్డి తోపాటు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న బీ అర్ ఎస్, కాంగ్రెస్ మధ్య పోటి ఉండనుంది. పోలింగ్ కు మరో నాలుగు రోజులు సమయం ఉండడంతో బీ అర్ ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.  బీ అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిష్టవేయగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పై తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. 


మరో వైపు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సైతం రాకేష్ రెడ్డి గెలుపుకోసం వర్ధన్నపేట, భూపాలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో రేపు ప్రచారం చేయనున్నారు. మరో వైపు నల్గొండ, ఖమ్మం జిల్లాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాకేష్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టుబట్టి మరీ రాకేష్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకోవడంతో ఈ ఎన్నికను ఆయన సవాలుగా తీసుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత కావడంతో ఆయన స్టూడెంట్స్‌ను టీం లుగా రంగంలోకి దింపారు. 


కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు పోటీపడి పట్టభద్రుల ఓట్లను నమోదు చేశారు. అయితే ఈ సారి పట్టభద్రులు ఓటు హక్కు నమోదుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఇద్దరు నేతలు నమోదు చేయించిన ఓట్లు గెలుపు ఓటములు కీలకం కానున్నాయీ. ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రుల స్థానాన్ని వదులుకోవద్దని రెండు పార్టీలు చూస్తున్నాయి.