ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు దాటికి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 


ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంలో ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌ నేతృత్వంలో జరిగిన సమావేశానికి నేతలంతా వచ్చారు. అగ్ర నేతలు గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు. 


బాణ సంచా కాల్చినప్పుడు ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. అంతే మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే టైంలో అ నివాసంలో ఉన్న సిలిండర్‌ పేలింది. ఈ ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో స్పాట్‌లోనే ఒకరు చనిపోగా... మరో ఆరురుగు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటి వరకు నేతల రాకతోసందడిగా ఉన్న ప్రాంతం రక్తసిక్తమైపోయింది. 


చీమ‌ల‌పాడుఆత్మీయ సమావేశం పరిసరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. మృతుడి కుటుంబం, క్ష‌త‌గాత్రుల‌ ఫ్యామిలీలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. 


అసలు ఏమైందంటే..
కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేసింది. పక్కనే వంటలు చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పటాకులు పేల్చారు. కొన్ని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పై పడటంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి


చీమలపాడు ఘటన పట్ల మంత్రి పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపున బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రును ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన తీరును నాయకులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పువ్వాడను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.