Eatala Rajender: మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మునుగోడు ఎన్నిక తర్వాత రాజకీయ ప్రళయం వస్తుందని వ్యాఖ్యానించారు. అనేకమంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. నల్గొండలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
పార్టీ ఫిరాయింపుల మీద బ్రతుకున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో చేసినట్లు నల్గొండలోనూ గ్రామగ్రామానికి, ఇంటింటికీ ఇంటెలిజెన్స్ వారిని పంపించి కౌన్సిలింగ్ చేస్తున్నారని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని.. పార్టీ మారకుండానే మంత్రులను చేసిన పార్టీ టీఆర్‌ఎస్ అని విమర్శించారు.
కేసీఆర్ అబద్ధాల గురించి ప్రజలకు తెలుసు
నల్గొండ జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్ధాల గురించి ఇక్కడి ప్రజలకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. కేసీఆర్ అహంకారం పోవాలి అంటే ఇక్కడ రాజగోపాలరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా దురహంకార, దుర్మార్గ పాలన పోవాలని కోరుకుంటున్నారని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పింఛన్లు పోతాయని బెదిరిస్తున్నారని.. హుజురాబాద్ లో ఏమైనా పోయాయా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఆరిపోతున్న దీపమని.. ప్రజలతో ఛీ కొట్టించుకుంటున్న పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు.
గతంలో కూడా ఈటల రాజేందర్ ఇలాంటి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉండేది మూడు నెలలే అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. కేసీఆర్ ఉపఎన్నికలు ఉంటే తప్ప ఫౌంహౌజ్ నుంచి బయటికిరాడని ఈటల విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టని ప్రభుత్వం.. విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందనుకోవడం భ్రమేనన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలివైనవారని.. కేసీఆర్ జిమ్మిక్కులు బాగా అర్థమై ఉంటాయని ఈటల అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలచేతిలో కేసీఆర్కి పరాభవం తప్పదన్నారు.