మానవతావాది, హేతువాది, మానవ హక్కుల పోరాటకర్త అయిన బాబు గోగినేని తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. తరచూ స్వామీజీలు, దేవుళ్లు, మూఢ నమ్మకాలు సహా ఇతర సామాజిక పరిస్థితులపై స్పందిస్తుండే బాబు గోగినేని ఇప్పుడు మునుగోడులో పూర్తయిన ఉప ఎన్నికల గురించి కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఏ విషయాన్ని అయినా లాజిక్ ప్రస్తావించి మరీ విమర్శలు చేస్తుంటారు లేదా ప్రశ్నిస్తుంటారు. తాజాగా అదే తరహాలో ఈ మునుగోడు విషయంలోనూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రాజకీయం మరీ నీచంగా మారిపోయిందని బాబు గోగినేని విమర్శించారు. పార్టీ తమ ఓటర్లకు 5 వేలు ఇవ్వమని డబ్బులు పంపితే మధ్యలోని వారు వెయ్యి నొక్కేసి నాలుగు వేలే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రజల్ని కూడా బాబు గోగినేని వదల్లేదు. ముక్క మెక్కి, చుక్క తాగి అనైతికంగా వ్యవహరించారని, నిబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. మంచి పనుల సంగతి అటుంచితే ఆఖరికి దొంగ పనుల్లో కూడా నిజాయతీ లేకపోతే ఇక సమాజం ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు బాబు గోగినేని ఫేస్ బుక్‌లో, ట్విటర్‌లో పోస్టులు పెట్టారు.
‘‘రాజకీయం నీచంగా మారిపోయింది! హై కమాండ్ 5 వేలు ఇవ్వమంటే 4 వేలు మాత్రమే ఇచ్చి వెయ్యి నొక్కేసారంట లీడర్లు. గో మూత్రం పోయమంటే నైంటీ యెమెల్ సోమరసం పోసారట. ప్రజలూ తక్కువ తినలేదు/తాగలేదు: ముక్క మెక్కి, చుక్క తాగి, అనైతికంగా, నిబద్ధత లేకుండా, పలు నోటుకు-ఓటు స్కీముల్లో జేరి, చివరికి వారికి ఇష్టం వచ్చినట్లు ఓటు వేశారట. ఎవడినీ నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. మంచి పనులు సరే! కానీ, దొంగ పనుల్లో కూడా నిజాయతీ లోపించడం జరిగితే సమాజం ఎలా నడుస్తుంది? ఎక్కడికి పోతున్నాం మనం? Thieves Honour అని ఒకటి ఉంటుంది అని అందరికీ గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జై పార్టీ స్వామ్యం.’’ అని బాబు గోగినేని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో కేవలం మూడు రౌండ్లలోనే బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా, 12 రౌండ్లలో కారు జోరు సాగింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లెప్ట్ పార్టీలతో పొత్తు టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ విజయం సాధించడం ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ వద్ద టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
నల్గొండలో హ్యాట్రిక్ విజయం
మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ వరుసగా గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది టీఆరెఎస్. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆరెఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.