నల్గొండ జిల్లాలోని ఓ తండాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తరచుగా వారి ఊరిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడమే ఇందుకు కారణం. అయితే, ఈ వరుస అగ్ని ప్రమాదాలకు ఎవరు కారణమో ఎవ్వరికీ తెలియరావడం లేదు. గత 22 రోజులుగా ఇలా జరుగుతూనే ఉంది. దీంతో జనం చేతబడి ప్రభావం అయి ఉంటుందని జంకుతున్నారు. అయితే, దీన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు మంత్రగాళ్లను ఆశ్రయించారు. ఇక వారి దోపిడీ దౌర్జన్యం మరో స్థాయిలో ఉంది. పూర్తి వివరాలివీ..
నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో ఉన్న పాతుర్ తండా అనే గ్రామంలో గ్రామస్థులు ఓ వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ ఊరిలో ఎక్కడో ఓ చోట గడ్డి వాముకు నిప్పు అంటుకోవడం, బట్టలు, పశువుల కొట్టం వాటంతట అవే తగలబడిపోవడం వంటి ఘటనలు అత్యంత తరచుగా జరుగుతున్నాయి. ఎవరూ నిప్పు అంటించకుండానే వాటికి మంటలు అంటుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు. అందుకు కారణాలు ఏంటో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు.
Also Read: Huzurabad Byelection : హూజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వారిద్దరిలో ఒకరు..! కేసీఆర్ మొగ్గు ఎవరి వైపు..?
అంతుచిక్కకుండా ఉన్న ఈ అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్న తండా వాసులు చేసేది లేక.. ఏదో మాయ ఉందని భావించి.. మంత్రగాళ్లను ఆశ్రయించారు. వారు పూజల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడు జంతువులను కూడా బలిచ్చారు. అయినా అగ్ని ప్రమాదాలు ఆగలేదు. తండాలో ఏదో రోజు ఎక్కడో ఓ చోట నిప్పు రవ్వలు రేగి మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. దీంతో వ్యవసాయ పనులు చేసుకునే జనం రోజూ పొలాలకు వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరిలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒక వస్తువు అగ్నికి ఆహుతి అవుతోంది. ఒకరోజు పొలంలో గడ్డివాము తగలబడితే, మరో రోజు ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టం అంటుకుంటోంది. ఇంకోసారి నట్టింట్లో మంటలు అంటుకొని బట్టలు, దుప్పట్లు, మంచాలు కాలిపోతున్నాయని గ్రామస్థులు వాపోయారు. చివరికి తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి కూడా పొగలు వస్తున్నట్లుగా గ్రామస్తులు వెల్లడించారు.
రాత్రివేళ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఎవరో గుట్టుగా చేస్తున్నారనే సందేహం వస్తుంది.. కానీ, పట్టపగలే ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ఈ మిస్టరీ ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. గత 22 రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతుండడంతో గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా అవుతోంది.