Puvvada Ajay Kumar Cycle Yatra: ఖమ్మం రోడ్లపై మంత్రి సైకిల్ సవారీ... అభివృద్ధి పనులపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి లైవ్ రివ్యూ
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నగర వీధుల్లో సైకిల్‌పై లైవ్ రివ్యూ చేశారు.
ఉదయాన్నే మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైకిల్‌పై పర్యటించారు.
నగరంలోని వీధులు తిరిగి స్థానిక ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, మార్కెట్ రోడ్, పంపింగ్ వెల్ రోడ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ఆర్డీవో కార్యాలయం, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, వైరా రోడ్‌లో పర్యటించారు.
ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైద్య సౌకర్యాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని పువ్వాడ ప్రారంభించారు.