హూజూరాబాద్ ఉపఎన్నికల్లో చేరికల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన అన్ని సమీకరణాలను పరిశీలించిన తర్వాత  ఇద్దర్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నారని.. ఆ ఇద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని అంటున్నారు. అధికారికంగా బయట పెట్టే వరకూ టిక్కెట్ ఆశావహులందరికీ.. పదవులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ముందుగానే... కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని.. టికెట్ రేసు నుంచి ఎలిమినేట్ చేశారు. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని నిర్ణయించారు. 


మిగిలిన వారికి కూడా కేసీఆర్... ఏదో ఓ స్థాయి పదవులు ఇవ్వడమో... లేకపోతే.. తర్వాత ప్రాధాన్యం ఇస్తామని చెప్పి బుజ్జగించడమో చేయనున్నారు. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కనీసం అరడజన్ మంది నేతల్ని చేర్చుకున్నారు. వారంతా టిక్కెట్ ఆశావహులే. వారిలో  టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా ఉన్నారు. ఆయనను ప్రధానంగా కేసీఆర్ అభ్యర్థి రేసులో పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన తర్వాత టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. అయితే రమణ లేకపోతే.. గెల్లు శ్రీనివాస్‌లలో ఒకరికి చాన్సిస్తారని అంటున్నారు. మిగతా వారందరికీ.. పదవులు ఇవ్వడం ద్వారానో.. బుజ్జగింపుల ద్వారానో ఎలిమినేషన్ విషయాన్ని చూచాయగా చెప్పబోతున్నారంటున్నారు. 


ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి రేసు నుంచి తప్పించిన కేసీఆర్...ఇటీవల పార్టీలో చేరిన ఇనుగాల పెద్దిరెడ్డికి కూడా ఏదో హామీ ఇచ్చేఅవకాశం ఉంది. పెద్దిరెడ్డి గతంలో రెండు సార్లు హుజూరాబాద్ నుంచి గెల్చినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన ప్రాబల్యం కోల్పోయారు. బలమైన అభ్యర్థి కాదని కేసీఆర్ నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఆయనకూ తర్వాతప్రాధాన్యం ఇస్తామనో.. లేకపోతే.. మరో రకమైన డిమాండ్లను పరిష్కరించడేమో చేసి.. సర్ది చెప్పాలని నిర్ణయించారు. అలాగే..  మాజీ మంత్రి ముద్దసారి దామోదర్ రెడ్డి కుటుంబీకులను కూడా పార్టీలో చేర్చుకున్నారు. వారికి కూడా కేసీఆర్ సర్దిచెప్పే అవకాశం ఉంది. 


ఈ నెల పదహారో తేదీ నుంచి దళిత బంధును హూజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ లోపు అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖరారు చేసుకున్నా అధికారిక ప్రకటన ఉండే అవకాశం లేదు. కానీ ఎవరికైతే .. హూజూరాబాద్ విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారో వారికే టిక్కెట్ ప్రకటిస్తారని అంటున్నారు. అయితే కేసీఆర్ ఇటీవల ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దళిత బంధు వేదికపైనే అభ్యర్థిని ప్రకటించినా ఆశ్చర్యం లేదని మరికొంత మంది అంటున్నారు.