Nagarjunasagar Buddhavanam : నాగార్జున సాగర్ లో 274 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టును మే 14న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిలుగా, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.



ఆసియాలోనే అతిపెద్ది బౌద్ధవనం 


మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో 274 ఎకరాల్లో సుమారు 100 కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించామన్నారు. బుద్ధుడు తర్వాత మరో బుద్ధుడిగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నా ఆచార్య నాగార్జునుడు 2000 వేల సంవత్సరాల క్రితం గడిపిన ప్రదేశంగా, వారు స్థాపించిన  విజయపురి విశ్వవిద్యాలయం, చరిత్ర ఆధారంగా బుద్ధవనం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా బుద్ధవనం నిర్మాణం పూర్తిచేశామన్నారు. మే 14న మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామన్నారు. ఈ బుద్ధవనం ప్రాజెక్టు దేశంలోనే విలక్షణమైన, అతిపెద్ద బౌద్ధ వారసత్వ పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 


పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు


బుద్ధవనం ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం(బుద్ధ సత్వ పార్క్), ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిస్, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ బుద్ధవనంలో దేశ, విదేశాల్లోని 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలున్నామన్నారు. అంతేకాకుండా మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలు ఉన్నాయన్నారు. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో చుట్టూ ప్రదాక్షణాల పథంతో బౌద్ధ స్థూపం, చుట్టూ వేలకొలది శిల్పాలను నిర్మించమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ స్థాయిలో బుద్దిస్ట్ ఆధ్యాత్మిక పర్యాటకులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. బుద్ధిజంలో తెలిపిన విధంగా బుద్ధవనం ప్రాజెక్టులో చేపట్టామన్నారు. బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో బుద్ధిజం నెలకొని ఉందన్నారు. బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు బౌద్ధ చరిత్ర తెలియజెప్పేలా ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు.