Komatireddy Venkatreddy : నల్గొండ రైతులకు నష్టం కలిగించేలా సీఎం కేసీఆర్ చర్యలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డికి కేటాయిస్తూ జీవో 246 తెచ్చారని ఆరోపించారు.  ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేసి జీవో విడుదల తెచ్చారన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 246 జీవోను రద్దు చేయకుంటే స్వయంగా దీక్షకు దిగుతానని ప్రకటించారు.  జీవో రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 


1980 ఒప్పందం ప్రకారం 


టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో నల్గొండ రైతులు నష్టపోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 45 టీంఎసీలు కేటాయించారన్నారు.  తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా నల్గొండ రైతులకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డికి కేటాయించడం సరికాదన్నారు. కృష్ణా నది నుంచి ఏపీ ప్రభుత్వం 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తుందని, అయినా తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.  జీవో  246ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తానన్నారు. జీవో రద్దుపై  అవసరమైతే సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని కలుస్తానన్నారు. ఎస్‌ఎల్‌బీసీ 30 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీల నీరు కేటాయించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


రక్తపాతం జరిగితే సీఎం కేసీఆరే కారణం 


జీవో 246 వల్ల నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే అందుకు సీఎం కేసీఆరే కారణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వమే రూపుమాపిందన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్‌ ల కాలువలు బాగున్నాయని, నల్గొండ జిల్లాలో కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వాటిని బాగుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందుతోంది.  ఈ ప్రాజెక్టు కేటాయించిన 45 టీఎంసీల నీటిని రద్దు చేయడంతో నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం వాటిళ్లనుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 246 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు.  


Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ రెడీ, తెలంగాణ సర్కారుకు బండి సంజయ్ లేఖాస్త్రం


Also Read : KTR Latest Tweet: మెడిసిన్ విద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు - కేటీఆర్