Komatireddy Venkatreddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారన్న ఓ ఆడియో వైరల్ అవుతుంది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఎంపీ కోమటిరెడ్డి కాల్ చేసి ఇలా బెదిరించారని వార్తలు వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యల్లో తరచూ వార్తలకెక్కుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా.... తన అనుచరులు చెరుకు సుధాకర్ ను చంపడానికి సిద్ధమయ్యారని బెదిరింపులకు దిగారు. చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారని, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్ కొడుకు సుహాస్‌కు ఫోన్ చేసి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఫోన్ కాల్ లో కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నట్లు ఉంది.
ఆడియో వైరల్
"సుధాకర్‌ను చంపేందుకు వంద వెహికిల్స్‌లో నా అనుచరులు తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ హాస్పిటల్ కూడా ఉండదు. నేను లక్షల మందిని సాయం చేశాను. వారందరినీ నేను కంట్రోల్ చేయలేను కదా. సుధాకర్ జైల్లో పడితే నేను ఒక్కడినేపోయాను. ఎవరూ పట్టించుకోకపోతే నేనే వెళ్లాను. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పకపోతే చంపేయడం ఖాయం" అని ఓ ఆడియో వైరల్ అవుతుంది. ఇందులో వాయిస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలిఉందని నెటిజన్లు అంటున్నారు. చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డికి వివాదాలు ఉండడంతో ఆ వాయిస్ ఎంపీదే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఆడియో నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనినైనా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందో లేక గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లా చెత్తబుట్టకే పరిమితం చేస్తుందో వేచిచూడాలి.
బీఆర్ఎస్ తో పొత్తు కామెంట్స్
తెలంగాణ రాజకీయాలపై ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల అదే స్టైల్‌లో తెలంగాణ రాజకీయాలపై కామెంట్స్ చేశారు. ఎప్పుడూ కాంగ్రెస్‌పైనే తీవ్ర విమర్శలు చేసే ఆయన ఈసారి చాలా పాజిటివ్‌గా స్పందించారు. కాంగ్రెస్ గాడిన పడుతుందన్న కోమటి రెడ్డి... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకం కాబోతోందని అన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని సూచించిన కోమటి రెడ్డి... వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావని అంచనా వేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం అవుతుందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా... ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. దిల్లీలో ఈ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి హైదరాబాద్ రాగానే తన మాటలు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలు అర్థం మరొకటి అంటూ వివరణ ఇచ్చారు.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తరఫున చక్రం తిప్పారు వెంకటరెడ్డి. ఎన్నికల ప్రచారం సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రలో కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఆస్ట్రేలియాలో ఆయన తన అభిమానులతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తాడని, కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఓ ఆడియో వైరల్ అయింది. రాజగోపాల్ రెడ్డికి సపోర్టు చేస్తూ ఉపఎన్నికలో గెలిపించాలని తన మద్దతుదారులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈ ఆడియోపై అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు చెత్త బుట్టలోకి వెళ్లాయంటూ కోమటిరెడ్డి కామెంట్ చేశారు.