Bandi Sanjay On BRS Govt : రాష్ట్ర ప్రజలకు ధరణి పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ, పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావుతో కలిసి ఇటీవల మాతృ వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు గౌతమ్ రావును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందుకు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయబోతున్నట్లు తెలిపారు. నేను ఏ జిల్లాకు వెళ్లినా పేదలు ఇండ్లు అడుగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా కేసీఆర్ సర్కార్ మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ  రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. 


గృహ ప్రవేశానికి ముందే కూలిపోయే ప్రమాదంలో  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 


 "సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డుబల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మంది లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు మంజూరు చేసింది? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశం చేయకముందే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యని కేసీఆర్ తాను మాత్రం 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నారు. రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు.  సూర్యపేట జిల్లాలో ఐకేపీ సెంటర్లలో పెద్ద కుంభ కోణం జరుగుతున్నా చర్యల్లేవు. రూ.20 కోట్ల కుంభ కోణం బయటపడింది.  పండించిన ప్రతి గింజ మేమే కొంటామని చెప్పిన కేసీఆర్ ఫ్రభుత్వం ... మాట తప్పింది. పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే.  జిల్లాలో అతిపెద్ద సమస్య ధరణి. అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేసి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పేదల భూముల వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. రుణాలు రావడం లేదు. ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది." - బండి సంజయ్  


  ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది 


 దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క తెలంగాణలోనే అని బండి సంజయ్ ఆరోపించారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నల్లా ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నారని విమర్శించారు.  సిగ్గు లేకుండా గ్యాస్ ధరల పెంపుపై ధర్నాలు చేస్తున్నారన్నారు. మద్యం ధరలను కూడా భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ కుల వృత్తుల మాదిరిగా లిక్కర్ దందా చేస్తోందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే కొత్త కుట్రలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం లిక్కర్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. నాణ్యతలేని డబల్ బెఆడ్ రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని ఆరోపించారు.  రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు మొండి చేయి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రైతు, పేదల ద్రోహి కేసీఆర్ అని ఆక్షేపించారు.  రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా 3 సుమస్యలు ..డబుల్ బెడ్ రూమ్, ధరణి, రుణ మాఫీ సమస్యలు వినబడుతున్నాయన్నారు. రాత్రి 1 గంట తర్వాత  ధరణి పోర్టల్ తెరుచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాల పైనే ఆధారపడిందని విమర్శించారు.  కేసీఆర్ కుమార్తె కూడా మద్యం వ్యాపారంపైనే ఆధారపడ్డారు. లిక్కర్ స్కామ్ నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.  లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో కవిత పేరు నాలుగు సార్లు వచ్చిందన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని బండి సంజయ్ ఆరోపించారు.