Chinese Apps Ban: 


నిషేధం ఎందుకంటే..? 


చైనా యాప్‌లపై నిఘా పెట్టిన కేంద్ర ప్రభుత్వం వరుసగా వాటిపై నిషేధం విధిస్తూ వస్తున్నాయి. కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా బ్యాన్ చేస్తున్నాయి. ఇప్పుడిదే విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వదంతులు, అవాస్తవాల వ్యాప్తి చేస్తున్న యాప్స్‌ను నిషేధిస్తున్నామని వెల్లడించారు. మొత్తం 138 బెట్టింగ్ యాప్స్‌ అందుబాటులో ఉండగా వాటిలో 94 యాప్స్‌ చైనాకు చెందినవే. వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం  బ్లాక్ చేసింది. ఈ యాప్స్ ద్వారా చైనా భారత్‌లోని వినియోగదారులపై నిఘా పెడుతోందని, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తోందని అన్నారు వినయ్ మోహన్. వదంతులు వ్యాప్తి చేస్తున్న యాప్స్‌ను మాత్రమే నిషేధించినట్టు వివరించారు. ఇదే సమయంలో టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్పారు. టెక్నాలజీని వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై కచ్చితంగా నిఘా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను దెబ్బ తీసే కంటెంట్ ఉన్న యాప్స్‌ను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. చైనాకు చెందిన లోన్ యాప్స్‌ వేధింపులకు గురి చేస్తున్నాయని మండి పడ్డారు. పొరపాటున ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్లపై దారుణంగా వడ్డీ రుద్దుతున్నారని అన్నారు. ఏటా ఈ వడ్డీ రేటు 3 వేల శాతం వరకూ ఉంటోందని చెప్పారు. లోన్ తీసుకుని చెల్లించలేని స్థితిలో ఉన్న వారిని మానసికంగా వేధిస్తున్నారని, ఈ కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం వల్ల దేశమంతటికీ ఈ సమస్య తెలిసొచ్చిందని అన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, యూపీలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 


కఠిన చర్యలు..


అనధికారిక యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే చర్యలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్‌పైనా కొరడా ఝుళిపించింది. 138 బెట్టింగ్ యాప్స్‌తో పాటు 94  లోన్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఇవన్నీ చైనాకు చెందినవే. సమస్య తీవ్రత ఆధారంగా వెంటనే ఈ నిషేధాన్ని అమల్లోకి  తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ సమైక్యతను దెబ్బ తీసే విధంగా ఉన్న యాప్స్‌ను తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. గతేడాది దేశ భద్రతకు భంగం కలిగిస్తున్న 54 చైనా యాప్స్‌ను నిషేధించింది కేంద్రం. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించిన కేంద్రం...వాటిని తొలగించింది. పౌరుల ప్రైవసీని దెబ్బ తీసే యాప్స్‌ పని పడతామని తేల్చి చెప్పింది. 2020లోనూ 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఆ తరవాత అదే ఏడాది సెప్టెంబర్‌లో 118 యాప్స్‌ని బ్లాక్ చేసింది. చట్ట విరుద్దమైన లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్ అయింది. వీటిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అక్రమ లోన్ యాప్‌లపై కఠిన చర్యలకు ప్రణాళిక రచించింది. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశించింది. వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.