woman protested to fill potholes on the road : హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి క్రమంగా దిగజారుతోంది. చాలా చోట్ల రోడ్లపై గుంతలు పడినా పట్టించుకోవడం లేదు. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ఈ గుంతల గురించి ఆలోచించే తీరిక లేక సర్దుకుని పోతున్నారు. ఓ కానీ ఆ గుంతల్లో పడి గాయపడుతున్న పిల్లలను చూసి తట్టుకోలేకపోయిన ఓ అమ్మ రంగంలోకి దిగడంతో మొత్తం సీన్ మారిపోయింది. అధికారులు హుటాహుటిన వచ్చి రిపేర్లు చేస్తామని బతిమాలుకోవాల్సి వచ్చింది.


 హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కానీ ఆ రోడ్డు నిర్వహణను పట్టించుకోకపోవడంతో గుంతలమయంగా మారింది. ఇటీవల వర్షం పడటంతో ఆ గుంతల్లో నీరు నిలిచిపోయింది. రోడ్డు రాను రాను ప్రమాదకరంగా మారింది.    కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు వచ్చి పోతూంటారు.  వాళ్ల పిల్లలు కూడా ఇదే  దారిలో రోజు స్కూల్ కు వెళ్తుంటారు.  గతంలో ఈమె పిల్లలు ఈ రోడ్డు నుండి వెళ్తు కింద పడ్డారు. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో గుంతల్లో నీళ్లు ఉండటం.. తన పిల్లలు గాయపడిన విషయం గుర్తు రావడంతో వెంటనే ఆందోళనకు దిగారు.


ఆ రోడ్డులో ఉన్న గుంతల్లో కూర్చున్నారు. గతంలో  అధికారులకు ఆమె ఫిర్యాదు  చేసినా  పట్టించుకోలేని ఇక లాభం లేదని ఆమె   ఆనంద్ నగర్ చౌరస్తాలోని గుంతలో కూర్చున్నారు. ఆమె  గుంతలు పూడ్చాలని నిరసన తెలుపుతున్నారని సమాచారం రావడంతో అధికారులు వచ్చారు. మీడియా కూడా పెద్ద ఎత్తున రావడంతో అధఇికారులు హైరానా పడ్డారు.   జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడించారు. రేపోమాపో గుంతలు పూడుస్తామని ఆందోళన విరమించాలని కోరడంతో నిహారిక శాంతించారు.                                                              


 రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం నీరు  చేరి  అవస్థలు పడుతున్నామన నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు  ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని.. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.  తాము ట్యాక్స్ లు  కడుతున్నాం.. మాకు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించకపోతే ఇదే గుంతలో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని  హెచ్చరించారు.                             


మహిళ పోరాటానికి చాలా మంది మద్దతు తెలిపారు. పౌరులు ఈ మాత్రం నిరసన తెలిపితే తప్ప.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం లేదన్న అసంతృప్తిని ప్రజలు వ్యక్తం చేశారు.