AP CEO Mukesh Kumar Meena Key Comments: మాచర్ల పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించిన వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల సంఘం నుంచి బయటకు వెళ్లలేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో ఎప్పుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలుస్తుందని చెప్పారు. ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. మాచర్లలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందని.. ఈ టైంలో అక్కడ టీడీపీ నేతల పర్యటన సరికాదని అన్నారు. ప్రస్తుతం రాజకీయ నేతలు ఎవరూ పరామర్శలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. బయటి నాయకులు ఎవ్వరూ మాచర్ల వెళ్లకూడదని.. ఎవ్వరినీ ఈ గ్రామాల్లోకి వెళ్లనివ్వొద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చామని అన్నారు.
'పిన్నెల్లి కోసం 8 బృందాలతో గాలింపు'
మరోవైపు, మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీస్ బృందాలు పని చేస్తున్నాయని సీఈవో ఎంకే మీనా తెలిపారు. పిన్నెల్లి అరెస్ట్ ఈసీ సీరియస్ గా ఉందని.. త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అటు, పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలు, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
అటు, జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను ఎంకే మీనా ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెదురుమదురు ఘటనల మినహా.. ఈ నెల 13న పోలింగ్ ప్రశాంతంగా సాగిందని.. అదే స్ఫూర్తితో కౌంటింగ్ రోజు కూడా ప్రణాళికబద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
- ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి.
- లెక్కింపు రోజున ఎన్ని గంటలకు, ఎన్ని టేబుళ్లపై లెక్కింపు చేపడతారో అనే విషయాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలి.
- జర్నలిస్టులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలి.
- స్ట్రాంగ్ రూంల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి.
- ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బారికేడ్లతో పాటు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి.
- పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యలను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేయాలి.
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్ల ఏర్పాటు చేసి.. వాటి లెక్కింపు తర్వాతే ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలి.
- హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్ ను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డేటా ఎంట్రీకి సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.
- అనధికార వ్యక్తులు, ఇతర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించకుండా చర్యలు చేపట్టాలి.