Macherla politics : మాచర్ల పోలింగ్ దాడులు లెక్కలేనన్ని - వరుసగా రిలీజ్ చేస్తున్న టీడీపీ, వైసీపీ !
Andhra News : మాచర్లలో పలు చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను టీడీపీ, వైసీపీ రిలీజ్ చేస్తున్నాయి. వీడియోల్లో ఏ పార్టీ వారు దాడులు చేస్తున్నారో తెలియడం లేదు కానీ.. పరస్పర ఆరోపణలు మాత్రం చేసుకుంటున్నారు.
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అక్కడ పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు అల్లర్లు చెలరేగడం.. అదే సమయంలో ఆలస్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో మాచర్ల పరిస్థితి హైవోల్టేజ్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రెండు పార్టీల నేతలు వీడియోలు విడుదల చేస్తున్నారు. మీరు రిగ్గింగ్ చేశారంటే.. మీరు రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసి మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్ చేసిందని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తమృకోట గ్రామంలోనూ రిగ్గింగ్ జరిగిందని కొన్ని ఘర్షణల వీడియోలను వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అదే ఘటనను కొంత మంది టీడీపీ సానూభూతి పరులు వైసీపీ నేతలు చేశారని ఆరోపిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇలా మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను పోటాపోటీగా రెండు పార్టీలు రిలీజ్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘటనలన్నింటిపై పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారని.. రిగ్గింగ్ లాంటివేమీ జరిగినట్లుగా రిపోర్టులు రాలేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.