Police Searching For Ysrcp Mla Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని ఖండించారు. ఈవీఎం ధ్వంసం తర్వాత ఆయన పక్కా ప్లాన్‌తోనే పరారైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి.. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. మొదట తాము ఎక్కడికి పారిపోలేదని పిన్నెల్లి నుంచి సమచారం వచ్చింది, కానీ గత కొన్ని రోజుల నుంచి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆచూకీ తెలియడం లేదు. కేసులు, అరెస్ట్ భయంతో పిన్నెల్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఫోన్ ఆధారంగా..


ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల (Gurazala) పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం దీనికి సంబంధించి సీసీ ఫుటేజీ బహిర్గతం కావడంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈసీ ఆదేశాలతో ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీస్ బృందం హైదరాబాద్ ఇందూ విల్లాస్ కు చేరుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన పిన్నెల్లి కారును పోలీసులు అనుసరించారు. సంగారెడ్డి పోలీసులను సైతం అప్రమత్తం చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు. అయితే, కారు పటాన్‌చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్దిదూరం వెళ్లి గణేష్ తండా వద్ద ఆగిపోయింది. కారులో డ్రైవర్, గన్‌మ్యాన్, ఆయన ఫోన్ మాత్రమే ఉంది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పిన్నెల్లి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు ఆయన్ను గాలిస్తున్నారు. మరోవైపు, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టాల పరిధిలో మొత్తం 10 సెక్షన్ల కింద ఈ నెల 20న కేసులు నమోదు చేశారు.


పోలింగ్ సిబ్బందిపై వేటు


అటు, ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం సిబ్బందిపై చర్యలు చేపట్టింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్‌లో అడుగుపెట్టగా.. అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. దాంతోపాటు ఈవీఎం నేలకేసి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది అలానే చూస్తుండిపోయారు. ఈ అభియోగాలతో వీరిపై వేటు వేసిన ఈసీ గురువారం లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా తమ ఆదేశాలలో పేర్కొంది. ఈవీఎం ధ్వంసం ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్ సరైన సమాధానం ఇవ్వలేదని ఈసీ పేర్కొంది.