TDP Leaders House Arrest In Macharla: టీడీపీ 'చలో మాచర్ల' (Chalo Macharla) పిలుపుతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన దాడుల్లో బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్.. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలను మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు, గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే మాచర్ల టీడీపీ ఇంఛార్జీ జూలంకటి బ్రహ్మరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు.
పరారీలో పిన్నెల్లి?
మరోవైపు, ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని ఖండించారు. ఈవీఎం ధ్వంసం తర్వాత ఆయన పక్కా ప్లాన్‌తోనే పరారైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీ బయటకు రాగా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడకు వెళ్లారు. ఎమ్మెల్యేకు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేసిన పోలీసులు తెలంగాణ పోలీసుల సాయంతో పిన్నెల్లిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
పల్నాడులో కొనసాగుతోన్న 144 సెక్షన్
మరోవైపు, పల్నాడు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత 10 రోజులుగా అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలింగ్ రోజు, తర్వాత పరిణామాల క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, సిట్ బృందం సైతం ఇక్కడ పర్యటించి హింసాత్మక ఘటనలపై నివేదికను డీజీపీకి అందించింది. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. గొడవల్లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
చంద్రగిరిలో పోలీసుల అలర్ట్
అటు, తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ గుమికూడవద్దని హెచ్చరించారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు వంటి వాటిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరైనా రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.