Weather Updates: దేశవ్యాప్తంగా వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాది అంతా ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మే 26వ తేదీ వరకూ వడగాలులు వీస్తాయని IMD వెల్లడించింది. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ ఏడాదిలో రికార్డ్‌ అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. IMD వెల్లడించిన బులిటెన్ ఆధారంగా చూస్తే మరో నాలుగు రోజుల పాటు అక్కడ ఇదే విధంగా వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కూడా ఉక్కపోతతో సతమతం అవుతోంది. అక్కడ గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కనీసం 24 ప్రాంతాల్లో టెంపరేచర్స్‌ తట్టుకోలేని విధంగా ఉన్నాయి. ఛండీగఢ్‌ ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది. ఈ ఎండల కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. 






దక్షిణాదిన వర్షాలు..


ఉత్తరాది ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇటు దక్షిణాదిన మాత్రం వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అటు అండమాన్ నికోబార్‌లోనూ వచ్చే వారం రోజుల పాటు ఎడతెగని వానలు కురుస్తుండొచ్చని స్పష్టం చేసింది. కేరళలో వాతావరణ విభాగ అధికారులు అప్రమత్తమయ్యారు. కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, పథనంతిట్ట జిల్లాలలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అక్కడి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కూడా రంగంలోకి దిగింది. వాతావరణం అనుకూలించని కారణంగా Calicut International Airport పై ప్రభావం పడనుంది. విమానాల రాకపోకల్లో ఆలస్యం జరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.