Tribal Carnival Nagoba Jatara: ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర సంబురం మొదలైంది. పుష్య అమావాస్యను పురస్కరించుకొని మెస్రం వంశీయులు అర్థరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి వంశ ఆచార సంప్రదాయం ప్రకారం మహాపూజ నిర్వహించారు. నాగోబా మహాపూజ సందర్భంగా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. సర్పజాతిని పూజించడమే నాగోబా జాతర ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. జాతరలో మెస్రం వంశ ఆచారాలు మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం (Inderavelly Mandal) కేస్లాపూర్ గ్రామంలో వారం రోజులపాటు నిర్వహించే నాగోబా జాతరపై ABP Desam ప్రత్యేక కథనం.




వైభవంగా ప్రారంభమైన నాగోబా
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం, నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులుగా మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రి చెట్టు (వడమర) నుంచి హస్తలమడుగు నుండి కాలినడకన వెళ్లి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా సిరికొండ నుంచి తెచ్చిన కొత్త కుండలను ఇవ్వగా మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. 


వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా... ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవ తల బౌలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు. ఆపై డోలు వాయిద్యాల నడుమ సమీప గోవాడ కు చేరుకుని సాంప్రదాయ పూజలు నిర్వహించారు. గోవాడలో పోయ్యిలనూ దర్శించుకొని పూజలు చేసి వెలిగించి నైవేద్యం తయారు చేశారు.


నాగోబాకు జలాభిషేకం చేసి మహా పూజ
పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహా పూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు బేటింగ్ (దేవుడి పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్లో పాల్గొన్నా వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ అధ్యక్ష్యతన మెస్రం పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. బెటింగ్ లను వంశ మహిళలు తెల్లటి దుస్తులు ధరించిన కొత్త కోడళ్లను తీసుకొచ్చి సతిక్ దేవతల వద్ద పరిచయం చేశారు. వంశ ఆడపడుచులకు కొత్త కోడళ్లు సంప్రదాయం ప్రకారం కట్న కానుకలు అందించి లోనికి ప్రవేశించారు. ఆపై వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని సాంప్రదాయ పూజలు నిర్వహించారు. రెండూ రోజులపాటు ఉపవాసాలు ఉంటూ వారు మిగిలిన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మరో నాలుగు రోజులపాటు సాంప్రదాయ పూజలు నిర్వహించి చివరి రోజున మండ గాజిలి పూజలతో మెస్రం వంశీయులు పూజలు ముగియనున్నాయి. 
ఛత్తీస్‌గఢ్ నుంచి వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
అర్ధరాత్రి మహా పూజతో నాగోబా జాతర ప్రారంభమైంది నాగోబా జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు నాకు భాను దర్శించుకుంటున్నారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జగదల్పూర్ రిటైర్డ్ అక్బర్రాం కొర్రం నాకు భాను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోని నాగోబా జాతరకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాగోబా జాతరను చూస్తుంటే ఎంతో వైభవంగా తమ సాంప్రదాయాలను కట్టుబాట్లను నియమనిష్ఠలతో ఆచార వివరాలతో కూడిన పూజలు నిర్వహిస్తూ ఈ వేడుకలు జరుపుకోవాలని ఎంతో ఆనందదాయకంగా ఉందని పుట్టుపూర్వం నుంచి నేటి వరకు కూడా ఈ సాంప్రదాయ పూజలు నిర్వహిస్తూ నాగోబాను అభిషేకం చేసి మహా పూజ చేయడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటించడం భావితరాలకు మార్గదర్శకులుగా నిలిచేలా కృషి చేస్తున్నందుకు నేస్తం వంశీయులకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 
ఆలయ పీఠాధిపతి మేస్రం వెంకట్ రావు మరియు మెస్రం వంశ పెద్దలు భక్తులు సాంప్రదాయ పూజల గురించి జాతర నిర్వహణ గురించి ఏబీపీ దేశంతో మాట్లాడారు. 


నాగోబా మహాపూజకు అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎంపీ గోడం నగేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, హాజరై నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి నాగోబా ఫోటో జ్ఞాపికను అందజేశారు. 
ఫిబ్రవరి 12న నాగోబా దర్బార్
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పి గౌస్ ఆలం మీడియాతో మాట్లాడుతూ.. నాగోబా జాతరకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులతో పర్యవేక్షణ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నాగోబా దర్బార్ ను ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు నాగోబా ప్రజా దర్బార్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి సీతక్క హజరుకానునట్లు తెలిపారు. నాగోబా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ గౌస్ ఆలం మీడియాకు తెలిపారు.