Water Crisis: ఈ సంవత్సరం నీటి సమస్యలు తప్పేలా లేవు. గతేడాది ఈ సమయానికి నిండుకుండలా ఉన్న రాష్ట్రంలోని జలాశయాలు ఇప్పుడు నీరు లేక వెలవెలబోతున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాజెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ వర్షాకాలంలో సగటు వర్షాపాతం కూడా నమోదు కాకపోవడం, ఎగువ నుంచి కూడా ఆశించిన స్థాయిలో ప్రవాహం రాకపోవడంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. సాగు నీటికి, తాగు నీటికి ఇబ్బందులు పడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో కూడా వర్షాలు లేకపోతే.. ఇక సంవత్సరమంతా నీటికి ఇబ్బందిపడాల్సిందేనని ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఎగువ ప్రాజెక్టులు నిండి కిందకు రావాలి


రాష్ట్రంలో వర్షాలు కురిసినా, కురవకపోయినా.. ఎగువన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే కృష్ణా నది ఉరకలెత్తేది. కానీ మన దగ్గర వర్షాలు లేవు, పై ప్రాంతాల్లోనూ వానలు కురవలేదు. దీంతో ఇటు కృష్ణా, అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు ఎక్కువగా లేవు. దీంతో భారీ వర్షాలు కురిసినా.. ముందు ఆయా ప్రాంతాల్లోని జలాశయాలు నిండి, ఆ తర్వాతే రాష్ట్రానికి నీటి ప్రవాహం రావాల్సి ఉంది. ఇది జరిగేనా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జూన్, జులై నెలల్లో వానలు పెద్దగా లేకపోయినా.. ఆగస్టు చివరి నాటికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ఆఖర్లో ఉన్నాం.. తర్వాత ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభం అవుతుంది. ఈ ప్రభావం కొన్ని జిల్లాలపై మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఆశించిన మేర వర్షాలు కురిస్తే కొంతలో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అంటున్నారు.


శ్రీశైలం నిండాలంటే..


శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 242 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి రెండు జలాశయాల్లో కలిపి మొత్తం 515 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అందులో సగం కూడా లేవు. డెడ్ స్టోరేజీ మినహా.. శ్రీశైలంలో 34.8 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో 21.8 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రావాలంటే.. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలు నిండాల్సి ఉంటుంది.


రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అనేక మధ్య తరహా, చిన్న జలాశయాలు ఉన్నాయి. గతేడాది ఈ సమయానికి వాటిలో 300 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం 165  టీఎంసీలే ఉన్నాయి. గోదావరి పరీవాహకంలో కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఆగస్టులో ఎప్పుడూ గోదావరికి భారీ వరదలు వచ్చేవి. కానీ ఈ సారి మాత్రం ప్రవాహం తక్కువగానే ఉంది.


Also Read: Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్


భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షలు, చిన్ననీటి పారుదల కింద 25 లక్షలు, నీటి అభివృద్ది సంస్థ పరిధిలో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితిలో వాటి సాగు ప్రశ్నార్థకమైంది.