TS Highcourt :   నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డికి  కోర్టులో ఊరట దక్కింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో  మర్రి జనార్ధన్ రెడ్డి  తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన    నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యేపై కోర్టు అనర్హతా వేటు వేయడంతో మర్రి జనార్ధన్  రెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఈ  పిటిషన్ ను  హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.  .               
 
ఎన్నికల సంఘానికి తప్పుడు  అఫిడవిట్ ను  మర్రి జనార్ధన్ రెడ్డి సమర్పించారని  నాగం జనార్ధన్ రెడ్డి  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  తెలంగాణ హైకోర్టు  నాగం జనార్ధన్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. నాగం జనార్ధన్ రెడ్డి  ఆరోపించినట్టుగా   ఆధారాలు సమర్పించలేదని  ఈ పిటిషన్ ను  కోర్టు కొట్టివేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014  పార్లమెంట్ ఎన్నికల సమయంలో  మహబూబ్ నగర్  పార్లమెంట్ స్థానం నుండి నాగం జనార్థన్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.-                 


2014లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి  నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేసే నాటికి ఆయన  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు.  2009లో  ఆయన  ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  టీడీపీకి రాజీనామా చేశారు నాగం జనార్ధన్ రెడ్డి.   2014 ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో  చేరారు.  మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి జనార్ధన్ రెడ్డి,  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  ఆయన తనయుడు శశిధర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  2018  ఎన్నికల్లో  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.             


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  చాలా మంది ఓటమి చెందిన నేతలు..  గెలిచిన నేతల అఫిడవిట్లు తప్పగా ఉన్నాయని .. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్..  అఫిడవిట్ ను ట్యాంపర్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపైనా కేసులు నమోదయ్యాయి.