Nagar Kurnool MP Ramulu joined BJP: నాగర్ కర్నూల్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేశారు. నేడు (ఫిబ్రవరి 29) ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన తాజాగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన కమలం పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు బాగా ఉన్నాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్‌ఎస్‌ను వీడినట్లు తెలుస్తుంది.
మరోవైపు, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశిస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఆయన ఢిల్లీలో కీలక పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు మల్లు రవి ప్రకటించారు. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతో పోతుగంటి రాములు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో రాములు కుమారుడు భరత్.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.
రాములు చేరికను ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారబోతుందని అన్నారు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడిందని.. తెలంగాణలో బీఆర్‌ఎస్ మునిగిపోయిన నావ.. అని అన్నారు. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు. చాలామంది బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని అన్నారు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తామని అన్నారు. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో జోరుగా ముందుగా దూసుకుపోతోందని అన్నారు. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు.