Sree Vishnu Swag: ఈమధ్య టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుండి ఒక సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను క్రియేటివ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వాటితోనే సినిమాపై ఆసక్తిని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణు అప్‌కమింగ్ మూవీ టైటిల్‌ను కూడా అలాగే అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఒక అడవిలో జంతువులు కథలు చెప్తున్నట్టుగా ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ గురించి చెప్పడానికి విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా అందరినీ నవ్విస్తోంది.


కోతి చెప్పిన కథ..


హసిత్ గోలి, శ్రీ విష్ణు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా పేరు ‘స్వాగ్’ అని టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ను ఒక ఫన్నీ వీడియోతో రిలీజ్ చేసింది మూవీ టీమ్. ముందుగా ఈ వీడియోలో ‘మంచి సినిమాలు ఏమీ లేవు. బోర్ కొడుతుంది’ అని ఒక చిన్న పిల్లవాడి వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత సునీల్ వాయిస్ ఓవర్‌తో కథ చెప్తాను అంటూ డైలాగ్ వినిపిస్తుంది. తన తండ్రికి కథలు చెప్పడం రాదంటూ ఆ పిల్లవాడు వెళ్లి టీవీ ఆన్ చేయగా.. అందులో అడవిలో జంతువులు కూడా బోర్ కొడుతోంది అంటూ డీలా పడిపోతాయి. అప్పుడే వస్తుంది ఒక కోతి. కథ చెప్తానంటుంది. అందరినీ కాసేపు ఎంటర్‌టైన్ చేస్తుంది. ఫైనల్‌గా సినిమా పేరు ‘స్వాగ్’ అని రివీల్ చేసి ఇది మనుషుల కథ అని చెప్పి వెళ్లిపోతుంది.


మగవాడి కథ..


టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ఇంత క్రియేటివిటీ చూపించిన హసిత్ గోలి.. ఇంక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. ‘స్టోరీ ఆఫ్ ది టైటిల్’ అనే పేరుతో ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఫైనల్‌గా ‘ఇది మగవాడి కథ. మగవాడి ఉనికిని నిలబెట్టిన మా శ్వాగణిక వంశానిది’ అంటూ టైటిల్ లోగో రివీల్ అవుతుంది. అంతా అయిపోయింది అనుకునే సమయానికి ‘స్వాగ్’ నుండి శ్రీ విష్ణు లుక్ కనిపిస్తుంది. ‘కరిబిత్ గిరిబిత్’ అనే డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఈ లుక్ చూస్తుంటే ‘రాజ రాజ చోర’లోని శ్రీ విష్ణు లుక్‌లాగానే ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.



శ్వాగణిక రాజు మంత్రం..


ఇక ‘స్వాగ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో శ్రీ విష్ణు చెప్పిన ‘కరిబిత్ గిరిబిత్’ అనే పదం శ్వాగణిక రాజు తరచుగా చెప్పే మంత్రం అని అర్థమవుతోంది. ఈ సినిమా ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ కాగా.. ఇందులో హీరో అసలు దొంగ ఎలా అవుతాడు అనే అంశాన్ని హసిత్ గోలి బయటపెడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా ఇది మగవాడి కథ అంటూ అందరి ముందుకు వచ్చాడు. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచాడు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో సునీల్‌తో పాటు గంగవ్వ వాయిస్ ఓవర్ కూడా హైలెట్ అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ‘స్వాగ్’ను నిర్మిస్తున్నారు.


Also Read: ఆ దర్శకుడు నన్ను కొట్టాడు, అందుకే సినిమా నుంచి తప్పుకున్నా - ‘ప్రేమలు’ బ్యూటీ మమితా