Mamitha Baiju: టాలీవుడ్‌లో మలయాళ భామలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరు తెలుగు సినిమాల్లో నేరుగా నటించినా.. నటించకపోయినా.. మలయాళ చిత్రాలతోనే ఇక్కడ కూడా పాపులారిటీ దక్కించుకుంటారు. అలాంటి వారిలో మమితా బైజు కూడా ఒకరు. తాజాగా విడుదలయిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’తో మమితాకు తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ దక్కింది. దీంతో టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ మేకర్స్ కూడా తనను క్యాస్ట్ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలోనే తాను ఒక తమిళ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్నానని, దర్శకుడు తనపై చేయి చేసుకోవడమే కారణమని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది మమితా.


తమిళ దర్శకుడితో సమస్య..


మమితా బైజు ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఇక తను తమిళంలో మొదటిసారి ‘రెబెల్’ అనే చిత్రంతో డెబ్యూకు సిద్ధమయ్యింది. ఈ సినిమా సైన్ చేసే సమయానికి మమితాకు మరో తమిళ సినిమా ఆఫర్ కూడా వచ్చింది. అదే ‘వనంగాన్’. బాలా.. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సైన్ చేసి షూటింగ్ ప్రారంభమయిన తర్వాత ‘వనంగాన్’ నుంచి తప్పుకుంది మమితా. దానికి కారణమేంటో తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దర్శకుడు బాలా తనపై చేయి చేసుకున్నారని అందుకే సినిమా నుంచి తప్పుకున్నానని వ్యాఖ్యలు చేసింది. 


చాలాసార్లు తిట్టారు..


ముందుగా సూర్య.. ‘వనంగాన్’ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు మమితా బైజు కూడా దర్శకుడు బాలాపై ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘వనంగాన్ సినిమాలో విల్లడిచా మాటన్ అనే పాట ఉంది. అందులో డ్యాన్స్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు నేనెప్పుడూ అంతలా డ్యాన్స్ చేయలేదు. అంతే కాకుండా అందులో డ్రమ్స్ కూడా కొట్టాలి. అక్కడ ఉన్న ఒక డ్రమ్స్ కొట్టే అమ్మాయిని గమనిస్తూ నన్ను నేర్చుకోమన్నారు దర్శకుడు బాలా. నేను దానికి రెడీగా లేను. చాలా భయపడ్డాను. కానీ దానిని మూడు టేక్స్‌లో నేర్చుకున్నాను. అంతకంటే ముందే నేను నిన్ను తిడుతూ ఉంటాను పట్టించుకోకు అని ఆయన నాతో చెప్పారు. అలాగే చాలాసార్లు తిట్టారు కూడా’’ అని గుర్తుచేసుకుంది మమితా.


ఆయనకు తెలుసు..


తిట్టడం మాత్రమే కాదు.. ఒకసారి సెట్‌లో దర్శకుడు బాలా తనను కొట్టాడని కూడా చెప్పుకొచ్చింది మమితా బైజు. ఈ విషయం సూర్యకు తెలుసా అని ప్రశ్నించగా.. ‘‘సూర్య సార్‌కు తెలుసు. వాళ్లకి మంచి ర్యాపో ఉంది. మనమే అందులో కొత్తవాళ్లం’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకే సినిమా నుంచి తప్పుకున్నట్టు బయటపెట్టింది. దీంతో మమితా స్థానంలో ‘వనంగాన్’లో హీరోయిన్‌గా రోషిని ప్రకాశ్‌ను ఎంపిక చేశారు బాలా. ముందుగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వనంగాన్’లో సూర్య హీరోగా ఎంపికయ్యాడు. దానికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. కానీ బాలాకు, సూర్యకు మధ్య విభేదాలు రావడంతో సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి ఇప్పుడు అరుణ్ విజయ్ వచ్చాడు. ఇదే విషయాన్ని అప్పట్లో ట్విటర్ ద్వారా ప్రకటించారు కూడా.


Also Read: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు - నటి కస్తూరి కామెంట్స్ వైరల్